నర్సాపూర్, మార్చి 20: పురుషులకు ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు అన్ని రంగాల్లో దూసుకు పోతున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వీరికి తోడుగా ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుండటంతో మహిళలు తమ కాళ్లపై నిలబడుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిన్నచింతకుంట గ్రామానికి చెందిన పోతారం నాగరాణి, తలారి సంధ్యలు సాధారణ గృహిణులు. ఇంటి పట్టునే ఉంటూ జీవనం గడిపేవారు. ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా సంఘంలో చేరి అందులో వారు ఉత్సాహంగా మంచి ప్రతిభ కనబరిచారు. ఇది గుర్తించిన ఐకేపీ ఏపీఎం గౌరీశంకర్ జ్యూట్ బ్యాగుల తయారీ చేయాలని సలహాలు సూచనలు ఇచ్చారు. ఐదు సంవత్సా రాల క్రితం వారు ఇరువురు మిషన్లను కొనుగోలు చేసి, జ్యూట్ బ్యాగులకు సంబంధించిన ముడి సరుకులను సమకూర్చుకుని జ్యూట్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టారు. వీరు గ్రామంలోని ఎనిమిదిమంది మహిళలకు తయారీ విధానం నేర్పించి వారికి ఉపాధి కల్పించడం మొదలు పెట్టారు. జ్యూట్ బ్యాగుల అమ్మకాలు బాగా జరుగడంతో లాభాలు చేకూరాయి. తయారీ చేసిన జ్యూట్ బ్యాగులను ప్రభుత్వ కార్యాల యాలకు, పాఠశాలలకు, కళాశాలలకు విక్రయించి లాభాలను గడించారు.
అలాగే ఎక్కడైతే ఎగ్జిబిషన్స్ జరుగు తాయో గుర్తించి అక్కడ వీరు స్టాళ్లను ఏర్పాటు చేసుకొని బ్యాగులను అమ్ముతారు. జ్యూ ట్ బ్యాగుల తయారీ కేవలం లాభార్జనే కాకుండా పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది. ప్లాస్టిక్ వాడకాలను నిర్మూలించే దిశగా జ్యూట్ బ్యాగుల తయారీ ఎంతో బాగుందని పలువురు అధికారులు ప్రశంసించారు. కలెక్టర్ సైతం వీరిని ప్రత్యేకంగా అభినందించారు. జ్యూట్‌తో వీరు లగేజీ బ్యాగ్, ఫ్రిడ్జ్ కవర్, లేడీస్ హ్యాండ్ బ్యాగ్, మనీపర్స్, మార్కెట్ బ్యాగ్ తదితర బ్యాగులను తయారు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి ముడిసరుకుని తెచ్చుకొని వీరు బ్యాగుల తయారీ చేపడుతున్నారు.
ఆర్డర్లు వస్తే ఇంకా విస్తృతం చేస్తాం..
మేము తయారీ చేసే జ్యూట్ బ్యాగులకు పెద్ద మొత్తంలో ఆర్డర్లు వస్తే వ్యాపారాన్ని ఇంకా విస్తృతం చేస్తాం. అమ్మకాలు పెరిగితే చాలా మంది మహిళలకు ఉపాధి కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాము. జ్యూట్ బ్యాగులు కావాలనుకున్న వారు మమల్ని సంప్రదించండి. జ్యూట్ బ్యాగులు వాడి పర్యావరణాన్ని కాపాడండి. జ్యూట్ బ్యాగులు కావాలనుకున్న వారు 9959981131 నంబర్‌ను సంప్రదించి ఆర్డర్లు ఇవ్వండి.
– పోతారం నాగరాణి
కరోనాతో అమ్మకాలు తగ్గాయి
కరోనా ప్రభావంతో జ్యూట్ బ్యాగుల అమ్మకాలు చాలా తగ్గాయి. అమ్మకాలు తగ్గడంతో కొద్దిగా నష్టం వచ్చింది. కరోనా లేక ముందు అమ్మకాలు బాగుండి లాభాలు గడించాము. జ్యూట్ బ్యాగులను కొనుగోలు చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఎలాంటి బ్యాగులు కావాలన్న ఆర్డర్లపై తయారీ చేసి అందించడానికి సిద్ధంగా ఉన్నాము.
– తలారి సంధ్య