సిద్దిపేట, మార్చి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రధాన వాగులైన కూడవెల్లి, హల్దీ వాగుల్లో గోదారమ్మ పరుగులు తీయనున్నది. మండుటెండల్లో గంగమ్మ జలతాండవం చేయనున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేడు ఆర్థ్ధిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు కూడవెల్లి, హల్దీవాగులకు గోదావరి జలాలను విడుదల చేయనున్నారు. తద్వారా యాసంగి పంటలకు నీరందనుంది. ఇందుకోసం నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయడంతో పాటు అక్కడ ఉన్న మరోగేట్ ద్వారా యాదాద్రి జిల్లాలోకి నీటిని విడుదల చేయడంతో గుండి చెరువులోకి నీళ్లు వెళ్తాయి. ఇక సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని సంగారెడ్డి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేస్తారు. నాలుగైదు చెరువులు నిండి హల్దీవాగులోకి గోదావరి జలాలు పరుగులు తీస్తాయి.
మండుటెండల్లో హల్దీవాగు, కూడవెల్లి వాగులకు నీటిని విడుదల చేస్తుండడంతో రైతు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పంటలు దక్కుతాయని ఆనందానికి గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు. కోట్లాది రూపాయలు వ్యయం చేసి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు నిర్మించారు. సాగు,తాగునీటి వెతలు తీర్చారు. గోదావరి జలాలను గతేడాది బీడు భూములకు మళ్లించిన అపర భగీరథుడు సీఎం కేసీఆర్. గతేడాది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలతో వందలాది చెరువులు నింపారు. ఈసారి కూడా సిద్దిపేట,మెదక్ జిల్లాల్లో చెరువులు,కుంటలు, చెక్‌డ్యామ్‌లను గోదావరి జలాలతో నింపనున్నారు.
మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌తో పాటు కూడవెల్లి, హల్దీవాగులను నింపడంతో పాటు యాదాద్రి జిల్లాకు జలాలు వెళ్లనున్నాయి. మల్లన్నసాగర్ వద్ద తుక్కాపూర్ పంప్ నడుస్తున్నది. కొండపోచమ్మ రిజర్వాయర్ 15 టీఎంసీల సామర్ధ్యంతో నిర్మించారు. ఈ రిజర్వాయర్ బండ్ 1.5 కిలోమీటర్ వద్ద సంగారెడ్డి కెనాల్ హెడ్ రెగ్యులెటర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ నీటిని విడుదల చేయడంతో సంగారెడ్డి కెనాల్ ద్వారా 6.25 కిలోమీటర్ వద్ద నీటిని మళ్లిస్తారు. ఇక్కడ నీటిని విడుదల చేయడంతో తొలుత సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని చౌదరిపల్లి బందం చెరువులోకి గోదావరి జలాలు చేరుతాయి. ఆ చెరువు నుంచి వర్గల్ పెద్ద చెరువుకు, అక్కడి నుంచి శాకారం ధర్మాయిచెరువుకు, అక్కడి నుంచి అంబర్‌పేట ఖాన్ చెరువులోకి గోదావరి జలాలు వెళ్తాయి. ఖాన్ చెరువు నుంచి హల్దీవాగులోకి జలాలు చేరుతాయి. సంగారెడ్డి కెనాల్ నుంచి హల్ద్దీవాగుకు మధ్య 6 కిలోమీటర్ల ఉంటుంది. అలా ప్రారంభమైన హల్దీ వాగు నాచగిరి లక్ష్మీనృసింహస్వామి దేవస్థానం, మెదక్ జిల్లాలోని తూప్రాన్, మాసాయిపేట, వెల్దుర్తి మండలాల మీదుగా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వద్ద మంజీరా నదిలో గోదారమ్మ కలుస్తుంది. హల్దీ వాగు ప్రారంభం నుంచి మంజీరా వరకు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది.
మెదక్ జిల్లాలోని మంజీరా నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు పరుగులు పెట్టనున్నాయి. హల్ద్దీవాగుపై మొత్తం 32 చెక్‌డ్యామ్‌లు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. వీటిలో సిద్దిపేట జిల్లాలో 9, మెదక్ జిల్లాలో 23 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంత మేరకు వీలైతే , అంత వరకు నీటిని అందించేందుకు నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. యాసంగిలో వేసిన వరితో పాటు ఇతర పంటలను కాపాడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఇప్పటికే మల్లన్నసాగర్ పంప్ హౌస్ నుంచి మల్లన్న సాగర్‌లోకి గోదావరి నీటిని ఎత్తిపోస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని తుక్కాపూర్‌లోని 12వ ప్యాకేజీ ద్వారా మల్లన్నసాగర్ కాలువ ద్వారా దుబ్బాక, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని చెరువులు, చెక్‌డ్యామ్‌లు, కుంటలను నింపుతున్నారు. యాసంగిలో సాగుచేసిన పంటలకు మరో 30-40 రోజుల పాటు నీళ్లు అందితే పంటలు చేతికి వస్తాయి.
హల్ద్దీవాగుకు గోదావరి జలాలు…
సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో పుట్టిన హల్దీవాగులోకి నేడు మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నీటిని విడుదల చేయనున్నారు. హల్దీ వాగులో గోదావరి జలాలను విడుదల చేస్తే వాగుపై ఉన్న చెక్ డ్యామ్‌లన్నీ నింపుకొంటూ నిజాంసాగర్ ప్రాజెక్టు వరకు జలాలు తరలి వెళ్లనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సిద్దిపేట, మెదక్ జిల్లాలోని అన్ని చెక్‌డ్యామ్‌లు నింపాలని అధికారులు నిర్ణయించారు. అవసరమైతే నిజాంసాగర్ ప్రాజెక్టు వరకు నీటిని వదులుతారు. దీంతో ఈ ప్రాంత రైతుల నీటి గోస ఇబ్బందులు తొలిగిపోనున్నాయి. గత వేసవిలో కూడా గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. ఫిబ్రవరిలో అతిపెద్ద రిజర్వాయరైన మల్లన్నసాగర్‌ను సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్‌మానేరు) నుంచి అన్నపూర్ణ, సిద్దిపేట జిల్లాలోని రంగనాయక నుంచి మల్లన్నసాగర్ రిజర్వాయర్‌కు గోదావరి జలాలు వచ్చి చేరుతున్నాయి.