రామాయంపేట, మార్చి 18: ‘మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలి… ప్రతి విద్యార్థి ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకుంటూ పోటీ ప్రపంచంలో విజేతలుగా నిలిచి భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలి..’ అనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు బడులను బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ తెలుగు మీడియంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్నీ అమలు చేస్తున్నారు.. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘మన ఊరు- మన బడి’ అమలు చేస్తూ ప్రభుత్వ బడుల్లో పూర్తిస్థాయి ఆంగ్ల విద్య, మౌలిక వసతులు కల్పిచనుండడంతో సర్కారు విద్య మరింత బలోపేతం కానున్నది. కాగా, రామాయంపేట మున్సిపల్ పరిధిలోని బాలికల ప్రాథమిక పాఠశాలలో ఇప్పటికే ఉపాధ్యాయులు ఆంగ్ల బోధన చేస్తుండడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమానికి ఈ పాఠశాల ఎంపిక కావడంతో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్లోని బాలికల ప్రాథమిక పాఠశాలలో 2015 నుంచి ఉపాధ్యాయులు, హెచ్ఎం రాగి రాములు విద్యార్థులకు తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమం లో విద్యాబోధన చేస్తున్నారు. 2018 నుంచి ఒకటి నుంచి ఐదో తరగతి వరకు మొత్తం పూర్తిస్థాయిలో పాఠశాలను ఇంగ్లిష్ మీడియంగా మార్చా రు. పాఠశాలలో మౌలిక సదుపాయాలను కల్పిస్తూ విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసి చదువుపై ఆసక్తి పొందేలా ఉపాధ్యాయులు అన్నిరకాల చర్యలను చేపడుతున్నారు. హెచ్ఎంతో పాటు ఉపాధ్యాయులు తరగతి గదుల్లో విద్యార్థులను ఆకర్శించేలా బొమ్మలను, పాఠ్యాంశాలకు సం బంధించిన చిత్రాలను తీర్చిదిద్దారు. హెచ్ఎం, ఉపాధ్యాయులు పలువురి దాతల ద్వారా ఉచితంగా విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులను ఇప్పిస్తున్నారు. దీంతో రామాయంపేట మండలంలోనే ఈ పాఠశాల ఆదర్శంగా నిలిచింది. దీంతో ఈ పాఠశాలలో అడ్మిషన్ల సంఖ్య పెరిగింది. మంచి అర్హత కలిగిన ఉపాధ్యాయ సిబ్బందితో బోధన చేపట్టడంతో విద్యార్థుల తల్లితండ్రులు ప్రభుత్వ పాఠశాలలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అడ్మిట్ చేస్తున్నారు. ఈ పాఠశాలలో గతేడాది 190 మంది విద్యార్థులుండగా, ప్రస్తుతం 374 మంది విద్యార్థులకు చేరుకున్నది. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ‘మన ఊరు మనబడి’లో ఈ పాఠశాలను మరింత అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ పాఠశాలగా తయారు చేస్తామని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
ఉపాధ్యాయులందరి కృషితోనే..
ఉపాధ్యారులందరి కృషితోనే ప్రాథమిక పాఠశాలను ఇంగ్లిష్ మీడియంలో ముందుకు తీసుకెళ్తున్నాం. మూడేండ్ల పిల్లాడి నుంచి 5వ తరగతి చదివే చిన్నారి వరకు నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా క్లాసులను నిర్వహించి ఇంగ్లిష్‌లో మాట్లాడే విధంగా తీర్చిదిద్దుతున్నాం.
– రాగి రాములు, హెచ్ఎం పీఎస్ రామాయంపేట
‘మన ఊరు-మనబడి’ గొప్ప కార్యక్రమం
ప్రభుత్వం ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామం. ఈ కార్యక్రమంతో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మరింత చేరువగా ఉండి నాణ్యమైన విద్యనందజేస్తాం.
– జయమ్మ, టీచర్, ప్రభుత్వ పాఠశాల రామాయంపేట
నిరుపేద విద్యార్థులకు సదావకాశం
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాన్ని సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా పాఠశాలలో గతంలో తక్కువ మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో చేరడంతో మేము సంతోషంగా విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం.
– అన్నపూర్ణ,టీచర్ ప్రాథమిక పాఠశాల, రామాయంపేట
ఇంగ్లిష్‌లోనే మాట్లాడగలుగుతున్న..
మా పాఠశాలలో టీచర్లు ఇంగ్లిష్‌లోనే పాఠాలు చెబుతున్నారు. నేను మొదటి తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియంలోనే చదువుతున్నా. ఇప్పుడు నేను ఇంగ్లిష్‌లో మాట్లాడడం, చదవడం నేర్చుకున్నా. రాబోయే సంవత్సరంలో ఆరో తరగతిలో కూడా మా పక్కనే ఉన్న బడిలోనే అడ్మిషన్ తీసుకుని ఇంగ్లిష్ మీడియంలో చదువుతా.
– ఎం.వైష్ణవి, ఐదో తరగతి విద్యార్థిని
ఇంగ్లిష్ మీడియం అంటేనే ఇష్టం
ఇంగ్లిష్ మీడియం అంటేనే మాకు ఇష్టం. ఇంగ్లిష్‌లో చదువు బాగా వస్తుంది. మా టీచర్లు ఇంగ్లిష్‌లో రకరకాల బొమ్మలను చూపిస్తున్నారు. ఉదయం రావడంతోనే ప్రార్థ న అనంతరం మా టీచర్ బొమ్మలను చూపిస్తూ ఆంగ్లంలో చెబుతున్నరు.
– నిహారిక, అలేఖ్య, ఒకటో తరగతి విద్యార్థులు