హవేళీఘనపూర్, మార్చి 18: లోక కల్యాణార్థం నిర్వహిస్తున్న సహస్ర చండీయాగానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రం వేదిక కానున్నది. ఈమేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండల పరిధిలోని కూచన్‌పల్లిలో నేటి నుంచి ప్రారంభం కాను న్న ఈ చండీయాగం రంగంపేట పీఠాధిపతి మాధవానంద స్వామి ఆధ్వర్యంలో 23వరకు ఐదు రోజుల పాటు కొనసాగనున్నది. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో యాగం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి తెలిపారు. 55 మంది రుత్వికుల ఆధ్వర్యంలో పది యాగశాలల్లో యజ్ఞాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మొదటి రోజు లక్ష పుష్పార్చన, 110 సప్తశతి పూజల్లో పాల్గొంటారన్నారు. 25 మంది రుత్వికులు మండపాల వద్ద పూజలు నిర్వహిస్తారని, మొత్తం 200 మంది రుత్వికులతో చండీయాగం నిర్వహిస్తారని ఎమ్మెల్సీ తెలిపారు. యా గంలో రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొనున్న ట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందాలని ఎమ్మెల్సీ కోరారు.
ఏర్పాట్ల పరిశీలన..
ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శనివారం నుంచి ప్రారంభంకానున్న సహస్ర చండీయాగం పనులను మాధవానంద సరస్వతీస్వామి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనకు లక్ష్మీసుభాశ్రెడ్డి దంపతులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం యాగశాలలో ఏర్పాటు చేసిన హోమ గుండాలను ఆయన పరిశీలించారు. స్వామీజీ వెంట హవేళీఘనపూర్ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.