సంగారెడ్డి మున్పిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్
బస్తీ పర్యటనలో భాగంగా పట్టణంలోని వార్డుల్లో పర్యటన
సంగారెడ్డి, మార్చి 13: పట్టణాల అభివృద్ధిలో ప్రజల సహకారంతోనే సాధ్యమవుతుందని, వారు సూచించిన సమస్యలు గుర్తించి పరిష్కారానికి నివేదికలు సిద్ధం చేస్తామని సంగారెడ్డి టీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. ఆదివారం సంగారెడ్డిలో బస్తీ పర్యటనకు శ్రీకారం చుట్టి ప్రజల సమస్యలు అడిగా తెలుసుకున్నారు. బైపాస్ రోడ్డులోని 32వ వార్డు హరిహరక్షేత్రంలో హనుమంతుడి ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి స్థానిక వార్డు కౌన్సిలర్ రామప్ప ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మీ, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్‌తో కలిసి పర్యటన ప్రారంభించారు. అనంతరం 31వ వార్డు, 29, 9, 10 వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి కాలనీల్లో సమస్యలు తెలుసుకున్నారు. ఆయా సమస్యలపై ప్రణాళికలు రూపొందించి అవసరమైన నిధులు కేటాయించేందుకు అధికారులు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లను ప్రకటించారని తెలిపారు. ఆయా నిధులను సమస్యలున్న ప్రాంతాల్లో ఖర్చు చేసి అభివృద్ధి చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కొత్త కాలనీల అభివృద్ధికి నిధులు వినియోగించాలన్నారు.
నిధుల వినియోగం కోసం సమస్యలున్న వార్డులకు తొలి ప్రాధాన్యత ఉంటుందని, సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుల సూచన మేరకు బస్తీ పర్యటన చేస్తున్నామన్నారు. 10 రోజుల్లో పట్టణంలోని 38 వార్డుల్లో ప్రజల సమక్షంలో సమస్యలు గుర్తించి అత్యవసరమైన వాటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు నివేదికలు తయారు చేస్తారని స్పష్టంచేశారు. పర్యటనలో సీడీసీ కాసాల బుచ్చిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ లతా, కౌన్సిలర్లు పవన్ నాయక్, లాడే మనీలా, స్రవంతి, షేక్ సాబేర్, సమీ, విష్ణువర్ధన్, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ మోహన్ సింగ్ నాయక్, నాయకులు వెంకటేశ్వర్లు, నర్సింలు, బొంగుల రవి, హరికిషన్, విఠల్‌రెడ్డి, లాడే మల్లేశం, నవీన్, వైద్యనాథ్, అల్లంరెడ్డి, విశ్రాంతి మండల విద్యాధికారి వెంకటేశం, ఎన్ఆర్ఐ శకీల్, అంజాద్, యునూస్, అజీం, శ్రావణ్‌రెడ్డి, జలేందర్, ప్రభుగౌడ్, మురళీధర్, వాజీద్, ప్రవీణ్ కుమార్, పరుశరామ్ నాయక్, రితిక్రెడ్డితో పాటు ఆయా వార్డుల ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.