బడుగుల జీవితాలు బాగుపడాలని..
సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞం
దళితబంధు అవగాహన సదస్సులో కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, మార్చి 9: దళితుల ఆర్థికాభివృద్ధికే రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిందని జిల్లా కలెక్టర్ ఎం హనుమంతరావు స్పష్టం చేశారు. దళితుల జీవితాలు బాగుపడాలని సీఏం కేసీఆర్ తలపెట్టిన యజ్ఞమని పేర్కొన్నారు. దళితబంధు పథకానికి సంబంధించిన అవగాహన సదస్సును బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ హనుమంతరావు జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇప్పటికే కూరగాయల సాగులో రాణించిన రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. వారు సాధించిన ప్రగతిని వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నియోజకవర్గానికి 100 మంది లబ్ధిదారులను దళితబంధుకు ఎంపిక చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. కూరగాయల పంటలను ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి ఆర్థికాభివృద్ధిని సాధించాలన్నారు. కార్లు, ట్రాక్టర్ల వంటి వాహనాలు కొనుగోలు చేసి కష్టాల్లో పడవద్దని సూచించారు. ఇచ్చిన రూ.10 లక్షల్లో అవసరమైన రైతులకు బోరు, మోటారు వంటి సదుపాయాలను సమకూర్చుతామని స్పష్టం చేశారు. కేవలం 5 గుంటల భూమి ఉన్నవారు కూడా కూరగాయల సాగుతో రాణించవచ్చని ఆకాక్షించారు. కూరగాయ పంటలు సాగు చేస్తూ ఆర్థికాభివృద్ధి సాధించిన రైతుల స్ఫూర్తితో దళితబంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కౌలుదారుడి నుంచి ఆసామిగా…
ఉద్యాన పంటల్లో రాణించిన రైతులతో చర్చించిన కలెక్టర్ హనుమంతరావు వారి విజయ గాథలను వివరంగా తెలుసుకుం టూ లబ్ధిదారులు వారి స్ఫూర్తితో ఎదగాలన్నారు. ఈ క్రమంలో గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామానికి చెందిన రైతు ఎండీ హనీఫ్ విజయ గాథ అందరికీ ఆదర్శనీయమని కలెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా హనీఫ్ మాట్లాడుతూ అల్లాదుర్గం మండలం నుంచి హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చిన తాను తొలుత పరాయివారి భూములను కౌలుకు తీసుకొని కూరగాయలు సాగు చేయడం ప్రారంభించామని తెలిపారు. ఉద్యాన శాఖ అధికారుల సహకారంతో ఆయా రాష్ర్టాల్లో పర్యటించి కూరగాయల సాగుకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకున్నానని వెల్లడించారు. కూరగాయలు సాగు చేస్తూ, ముఖ్యంగా పందిరి సాగు, షెడ్ నెట్లో సాగు చేసి ఆర్థికంగా ఎదిగానని చెప్పారు. ప్రస్తుతం 8 ఎకరాల ఆసామిగా ఉన్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఎకరానికి 32 నుంచి 40 టన్నుల కూరగాయలను పండించిన హనీఫ్‌ను కలెక్టర్ అభినందించారు. నారాయణఖేడ్ మండలం రుద్రారం గ్రామానికి చెందిన సుభాష్ విజయగాథను అతని మాటల ద్వారానే అడిగి తెలుసుకున్న కలెక్టర్ వారి స్ఫూర్తిగా అందరూ ఎదగాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నర్సింహారావు, జిల్లా ఉద్యాన వన అధికారి సునీత, డీఆర్డీడీవో శ్రీనివాసరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబూరావు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.