మెదక్/మెదక్ మున్సిపాలిటీ, మార్చి6: మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని జీకేఆర్ గార్డెన్లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలంటే మహిళలు ఒక ప్రణాళికా బద్దమైన కార్యచరణతో ముందుకెళ్లాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందన్నారు. పలు పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. మున్సిపల్ కౌన్సిలర్ రాగి వనజ ఆధ్వర్యంలో మహిళలు పద్మా దేవేందర్‌రెడ్డిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. దేశంలో లేని పథకాలు రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఎం.పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మహిళా బంధు సంబురాలు ప్రారంభించారు. అంతకుముందు చౌరస్తాలో ఏర్పాటు చేసిన సీఎం భారీ కటౌట్‌కు ఎమ్మెల్యే రాఖీ కట్టారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, మున్సిపల్ ఆర్పీలు, మహిళా సంఘాలు, మహిళలు పెద్దఎత్తున పాల్గొని కేసీఆర్ కటౌట్‌కు రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఇతర దేశాల్లో అమలు చేయాలని చూస్తున్నారన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో రాష్ట్రంలో 10 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, మహిళా సంఘాల నాయకులు, కానిస్టేబుళ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్‌గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేడి మధుసూదన్‌రావు, కౌన్సిలర్లు లక్ష్మీనారాయణగౌడ్, ఆర్కే శ్రీనివాస్, వంజరి జయరాజ్, మహిళా కౌన్సిలర్లు దొంతి లక్ష్మి, మేడి కల్యాణి, మెదక్ ఎంపీపీ యమున, నాయకులు లింగారెడ్డి, అశోక్, జయరాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఉమర్ పాల్గొన్నారు.