రామాయంపేట/మిరుదొడ్డి, మార్చి 5: బుర్రకథలు, భజనలు, చిరుతల రామాయణం, కోలాటాలు, జడకొప్పు, హరికథలు, జానపద గేయాలు, వీధి నాటకాలు, భాగవతాల ప్రదర్శనలతో ఒకనాడు పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం ఉండేది. పొలాల్లో నాట్లు వేసేటప్పుడు, కలుపు తీసేటప్పుడు పాడే పాటలు హృదయాలను పులకింపజేసేవి. పగలంతా కష్టపడే శ్రమజీవులు ..సాయంత్రం వేళ ఈ కళలతో సేదతీరేవారు. చిన్నా, పెద్దా అంతా ఒకచోట చేరి ఆసక్తిగా తిలకించేవారు. కాలక్రమేణా పల్లె ప్రజల జీవనశైలి మారింది. నాటి కళలు జాడలేకుండా పోయాయి. నిఖార్సైన పల్లె పదాలు ఉనికిని కోల్పోతున్నాయి. ఒకప్పుడు ఊరి మధ్యలో రచ్చబండ దగ్గర యువకులు, పెద్ద మనుషులు అంతా చేరి ముచ్చట్లు పెట్టుకుని కాలక్షేపం చేసేవారు. ఇక, వినాయక నవరాత్రుల్లో అయితే మండపాల వద్ద భక్తిగేయాలు, భజనలు, భాగవతాలు, రామాయణ కథలను వినిపించేవారు. నేటి ఆధునిక ప్రపంచంలో సినిమాలు, టీవీలు, సెల్ఫోన్లు గ్రామాలను కమ్మేశాయి. ఖాళీ సమయం దొరికిందంటే చాలు సోషల్ మీడియాలో దూరిపోతున్నారు. దీంతో, ఈ వృత్తిని నమ్ముకున్న కళాకారులు వేరే రంగాల్లోకి వెళ్లిపోయి మేస్త్రీలు, కూలీలుగా మారారు. చిన్నపాటి ఉద్యోగాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. నేటి తరానికి కథలు, కళలు అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నదని, తాత ముత్తాతల నాటి కళా వారసత్వాన్ని వారికి అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలో చిందు కళాకారులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వీరు గ్రామాల్లో డబ్బుల కోసం ఒప్పందం కుదుర్చుకొని నాటకాలు (భాగవతం) ఆడుతారు. వారు పెట్టిన అన్నం, బట్టలు స్వీకరిస్తారు.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల పరిధిలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో 24 చిందు కళాకారుల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అన్ని కుటుంబాలకు కలిపి మొత్తం 12 ఎకరాల వ్యవసాయ భూమి మాత్రమే ఉంది. పంచుకుంటే ఒక్కొక్కరికి 20గుంటలు మాత్రమే వస్తుంది. దీంతో ఉన్న దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ, కూలీ పనులకు వెళ్తూ వచ్చిన డబ్బులతో కుటుంబాలను పోషిస్తున్నారు.
ఆకట్టుకున్న వీధి భాగవతాలు..
వీరారెడ్డిపల్లి చిందు కళాకారులు సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని మిరుదొడ్డి, సిద్దిపేట, రామాయంపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కామారెడ్డి తదితర మండలాల్లో మొత్తం 40 గ్రామాల్లో వీధి భాగవతాలు ప్రదర్శిస్తారు. సొంత గ్రామాన్ని వదిలి పెట్టి వెళ్లి సుమారు పదేండ్ల వరకు తిరిగి ఇంటి ముఖం చూసేవారు కాదు. వీరు వచ్చారంటేనే ఆయా గ్రామాల ప్రజలు ఎంతో సంతోషపడేవారు. చిన్నారులు, పెద్దలు నాటకం మొదలవ్వడానికి గంటల ముందే బొంతలు (గోనె సంచులు) ఈత కమ్మలతో అల్లిన సాపలను వేసి ముందే స్థలాన్ని ఆపుకొనే వారు. చిందు కళాకారులు తమ కళా నైపుణ్యంతో ఈల (సీటీ)ల మధ్య, తెలంగాణ సాంస్కృతిక, భాషాపరమైన పదాలతో బుడ్డర కాన్(జోకర్) మాట్లాడే జోకులతో అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేవారు.
జీవన విధానం…
చిందు కళాకారులకు వ్యవసాయ భూములు అంతగా లేకపోవడంతో ఆయా గ్రామాల్లో వీధి భాగోతాలను ఆడుతూ జీవితాలను గడిపేవారు. రామాయణం, మైరావణ, జాంబవంతుడి జీవిత చరిత్ర, బాలనాగమ్మ, బ్రహ్మంగారి చరిత్రతో పాటు మరి ఎన్నో నాటకాలు వేసేవారు. చదువు రాకున్నా తమకున్న పరిజ్ఞానంతో వారే దర్శకులుగా, సంగీతం, కొరియోగ్రఫీ చేసుకొని హాస్యంతో పాటు ఇతర పాత్రలకు జీవం పోసి ప్రజలను అలరింపజేసేవారు. పగటి వేళలో ప్రదర్శనలు నిర్వహించిన తర్వాత ప్రతి ఇల్లూ తిరుగుతూ అన్నం (బువ్వ), కూరలను సేకరించుకుని భోజనం చేసేవారు. ఆ గ్రామంలో కార్యక్రమాలు అయిపోయాక డబ్బులు తీసుకొని ఇతర గ్రామాలకు వెళ్లేవారు.
కనుమరుగవుతున్నచిందు భాగవతాలు…
నేడు ప్రతి ఇంటిలో టీవీ, ప్రతి ఒక్కరి చేతిలో సెల్ఫోన్ తప్పనిసరిగా మారింది. దీంతో నాటి జానపద కళలపై ప్రజలకు ఆసక్తి తగ్గిపోయింది. మారుమూల గ్రామాల్లో సైతం వీధి భాగవతాలను చూసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో నాడు ఒక్కో గ్రామంలో నెలల తరబడి ప్రదర్శనలు చేసిన చిందు కళాకారులు, నేడు మాత్రం కొన్ని రోజులు మాత్రమే కార్యక్రమాలను నిర్వహించి వెళ్లిపోతున్నారు.
వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం..
పొట్టకూటి కోసం తాతలు, తండ్రుల నుంచి వచ్చిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. జానపద కళలను కాపాడడం కోసం వీధి భాగవతాలు ప్రదర్శిస్తున్నాం. నేడు ప్రతి ఇంటిలో టీవీ ఉండడంతో మా ప్రద్శరనలకు ఆదరణ కరువైంది. దొరికిన కాడికి కూలీ పనులు చేసుకుంటూనే, వచ్చి రాని చదువుతో తెలుగు భాషపై ఉన్న మమకారంతో నాటకాలు వేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం.
– మేడిపల్లి సారంగపాణి,చిందు కళాకారుడు,వీరారెడ్డిపల్లి (సిద్దిపేట జిల్లా)
రావణాసురుడి వేశం వేసేవాడిని..
దాదాపు 50 నుంచి 60 ఏండ్ల కిందట నేను వీధి భాగవతాలను ప్రదర్శించేవాడిని నన్ను అందరూ ప్రధాన పాత్రలో నువ్వే ఉండాలని ప్రోత్సహించేవారు. వారి ఇష్ట ప్రకారమే నా పర్సనాలిటీ తగ్గట్లు మహాభారతంలో రావణాసురుడు, వీరబ్రహ్మంగారి చరిత్రలో బ్రహ్మంగారు తదితర పాత్రలను వేసేవాడిని. ఇప్పుడు ఆ కళలు లేవు.. ఆ భాగవతాలూ లేవు. అందరూ టీవీల్లో వచ్చే సీరియళ్లకే పరిమితమవుతున్నారు.
– బనగారి పెంటయ్య,
కళాకారుడు, నిజాంపేట (మెదక్ జిల్లా)
ఇప్పటికీ తబలానే వాయిస్తా..
నా ప్రాణం ఉన్నంత వరకు తబలాను వాయిస్తూనే ఉంటా. 40 ఏండ్లుగా అప్పట్లో వీధి భాగవతాలకు, ఇప్పుడు గణపతి మండపాల్లో తబలాను వాయిస్తా. గతంలో గ్రామాల్లో ఎవరైనా చనిపోతే రాత్రిళ్లు జాగరణ చేయడానికి భాగవతాల పాటలు పాడుతుంటే నేను తబలాను వాయించేవాడిని. ప్రస్తుతం మా ఊరిలో నిలిపే గణపతుల వద్ద రోజుకో మండపం దగ్గరికి వెళ్లి తబలా వాయిస్తున్నా.
– ఆకుల రామచంద్రం, తబలా కళాకారుడు, నందిగామ (మెదక్ జిల్లా)