మెదక్, మార్చి 5: మెదక్ ప్రజల చిరకాల ఆకాంక్ష, ఏండ్ల నాటి కల నెరవేరే సమయం సమీపిస్తున్నది. ఇక్కడి ప్రజలు మరికొద్ది రోజుల్లో రైలుకూత వినబోతున్నారు. త్వరలోనే మెదక్ మార్గంలో రైలు సేవలను ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైల్వేలైన్ మొత్తం పూర్తవడంతో రెండు రోజులుగా గూడ్స్ రైళ్లు నడుపుతూ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రూ.205 కోట్లతో అక్కన్నపేట నుంచి మెదక్ వరకు 17.2 కిలోమీటర్ల పొడవునా రైల్వేలైన్ నిర్మించారు. ఇందులో కేంద్రం రూ.102 కోట్లను భరించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.70 కోట్లు వెచ్చించింది.
మూడు స్టేషన్లు…
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ మార్గంలో మూడు స్టేషన్లు ఏర్పాటు చేశారు. అక్కన్నపేట స్టేషన్ నుంచి ఈ రైలుమార్గం ప్రారంభమవుతుంది. రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్, హవేళీఘనపూర్ మండలం శమ్నాపూర్తో పాటు మెదక్‌లో రైల్వేస్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ లైన్‌తో మెదక్ నుంచి అక్కన్నపేట, మిర్జాపల్లి మీదుగా సికింద్రాబాద్ రైల్వేలైన్‌కు అనుసంధానం కానున్నది. మెదక్ నుంచి అక్కన్నపేట మీదుగా సికింద్రాబాద్‌కు వెళ్లవచ్చు.
17.2 కిలోమీటర్లు.. రూ.205 కోట్లు..
అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు 17.2 కిలోమీటర్ల మేర పూర్తయ్యాయి. 2015 నవంబర్‌లో ఈ పనులకు శంకుస్థాపన చేశారు. గతంలో నిధులు మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించడంతో పనులు ప్రారంభమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం రూ.102 కోట్లు మంజూరు చేయగా, తెలంగాణ ప్రభుత్వం రూ.70 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనుల్లో వేగం పుంజుకుని 17.2 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ పనులు పూర్తయ్యాయి.
అన్ని సౌకర్యాలతో మెదక్ రైల్వేస్టేషన్..
జిల్లాకేంద్రం మెదక్‌లో రైల్వేస్టేషన్ అద్భుతంగా నిర్మించారు. పొడవైన ప్లాట్‌ఫాం, టికెట్ కౌంటర్ గది, ప్రయాణికులు కూర్చోవడానికి బెంచీలు ఏర్పాటు చేశారు. అత్యాధునికంగా ప్రయాణికుల అవసరాలకు తగ్గుట్టుగా స్టేషన్‌ను తీర్చిదిద్దారు. ప్రయాణికుల సౌకర్యాలు, సంబంధిత వ్యక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు స్వీకరించేందుకు బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
కల సాకారం కానున్నది..
మెదక్ ప్రజల కల సాకారం కానున్నది. అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. ఈ రైల్వేలైన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. గతంలో రైల్వేలైన్ పనుల్లో నాణ్యత లేకపోవడంతో వెంటనే రైల్వే అధికారులతో మాట్లాడి వెంటనే సమీక్ష ఏర్పాటు చేశాం. మెదక్-అక్కన్నపేట రైల్వేలైన్ పనుల్లో నాణ్యత, తొందరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే రైలును ప్రారంభించడానికి రైల్వేశాఖ సిద్ధమవుతున్నది. రైల్వే పనులకు సహకారం అందించిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే