మెదక్, మార్చి4 : మాతా శిశు సంరక్షణ కేంద్రం మెదక్ జిల్లా కేంద్రానికి కిలోమీటర్ దూరంలో రూపుదిద్దుకుంటున్నది. ఎంసీహెచ్ నిర్మాణంతో తల్లీబిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. దీని నిర్మాణంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే జిల్లా కేంద్ర దవాఖానలో 100 పడకలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్ర దవాఖానలో నవజాత శిశు కేంద్రం ఏర్పాటుచేశారు. రూ.54 లక్షలతో అత్యాధునిక హంగులతో సౌకర్యాలు కల్పించారు. ఈ కేంద్రాన్ని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రారంభించారు.
ఎంసీహెచ్ నిర్మాణానికి రూ.17 కోట్లు
ఎంసీహెచ్ భవనానికి ఎమ్మెల్యే కృషితో రూ.17 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులకు అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. ఎంసీహెచ్ కు సీసీరోడ్డు కోసం రూ.1.20 కోట్లు, భవనం చుట్టూ ప్రహరీకి రూ.80 లక్షలు మం జూరు చేయించారు. ఇప్పటి వరకు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఆ పనులు కూడా త్వరలో పూర్తి చేసి ఎంసీహెచ్‌ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
నిరంతరం ఎమ్మెల్యే పర్యవేక్షణ…
మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మెడికల్ అండ్ హెల్త్ ఈఈతో పాటు కాంట్రాక్టర్లతో మాట్లాడి, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. ఎంసీహెచ్‌లో డాక్టర్లు, గైనకాలజిస్ట్లు, నర్సులు, తదితర సిబ్బందిని ఆరు నెలల క్రితమే నియమించారు.
అన్ని హంగులతో ఎంసీహెచ్ భవనం
జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మాతా శిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్)ను మార్చిలో పూర్తి చేస్తాం. ఎంసీహెచ్‌కు రూ.17 కోట్లు మంజూరయ్యాయి. మరో 1.20 కోట్లతో సీసీ రోడ్డు పనులు, రూ.80 లక్షలతో ప్రహరీని నిర్మిస్తున్నాం. ఎంసీహెచ్ 5 ఎకరాల్లో 100 పడకల దవాఖానగా రూపుదిద్దుకుంటున్నది.
– పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, మెదక్