మహాశివరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సాగుతున్న జాతరల్లో జనం కిక్కిరిశారు. భక్తిపరవశంలో మునిగితేలుతూ దేవతామూర్తుల మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో జరిగిన బండ్ల ఊరేగింపు కనుల పండువగా సాగింది. ఆనవాయితీగా వస్తున్న ఆచారం ప్రకారం ముందుగా పాపన్నపేట సంస్థానాధీశుల బండి వెళ్లగా, మిగతా బండ్లు ఆ బండి వెంట వెళ్లాయి. సిద్దిపేట కొమురవెల్లి ఆలయంలో పెద్ద పట్నం ఘట్టం నయనానందకరంగా సాగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు, బండారి చల్లుకుని పట్నం దాటగా, క్షేత్రమంతా పసుపు మయంగా మారింది. సంగారెడ్డి జిల్లా కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నందివాహనంపై స్వామివారు ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చాడు. ఆయా ఉత్సవాలకు తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లోని భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
పాపన్నపేట, మార్చి 2: మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం జనారణ్యంగా మారింది. మహాశివరాత్రి రోజున ప్రారంభమైన అమ్మవారి జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉత్సవాల్లో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు తిలకించేందుకు వచ్చిన భక్తులతో క్షేత్రం పరిసరాలు కిక్కిరిపోయాయి. బుధవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా ఇండ్ల వద్ద ఉపవాస దీక్షలు చేపట్టిన వారు బుధవారం తెల్లవారేసరికి ఏడుపాయలకు చేరుకుని దీక్షలు విరమించారు. మహాశివరాత్రి రోజు వచ్చినవారు అమ్మవారి సన్నిధిలో జాగారం చేశారు. సాయంత్రం మహాజాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు అట్టహాసంగా సాగింది.ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగా మిగిలిన బండ్లు దానిని అనుసరించాయి.
అందరి చూపు దొరవారి బండి వైపు..
నిజాంకాలంలో రెండో అతిపెద్ద సంస్థానంగా వెలుగొందిన, ప్రసిద్ధిగాంచిన పాపన్నపేట సంస్థానాధీశుల బండి ఏడుపాయల జాతరలో ముందు తిరగడం ఆనవాయితీగా కొనసాగుతుంది. పాపన్నపేట బండి చుట్టపక్కల మండలాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కొన్ని మండలాల్లో ఎక్కడ జాతర జరిగినా వీరి బండే ముందు తిరగడం ఆనవాయితీ. దొరవారి బండి ఏడుపాయలకు చేరగానే అధికారులతో పాటు ఇతర అధికారులు స్వాగతం పలికి జాతరలో ముందు తిరిగేలా చర్యలు తీసుకున్నారు. ఆయా గ్రామాల సుమారు 70 బండ్లవారు వారి బండ్ల ముందు నృత్యాలు చేస్తూ, భక్తి పాటలు పాడుతూ, భజనలు చేస్తూ
ముందుకు సాగారు. ఈ బండ్లు తిరిగే అపురూప ఘట్టం నాగ్సాన్పల్లి వైపు నుంచి దుర్గామాత ఆలయం వరకు చేరుకుని జాతర చుట్టూ తిరిగాయి. అంతకుముందు ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్పీ సైదులు, ఏడుపాయల ఈవో సార శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొని ప్రారంభించారు. బండ్ల ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు.
కిక్కిరిసిన భక్తజనం..
ఏడుపాయల జాతర భాగంగా రెండోరోజూ బండ్లు తిరిగే కార్యక్రమానికి భక్తులు ప్రాధాన్యతనిస్తారు. ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పోతంశెట్టిపల్లి వైపు నుంచి భక్తులు భారీగా తరలిరావటం కనిపించింది. నారాయణఖేడ్, జహీరాబాద్, నిజాంసాగర్ వైపు నుంచి తరలివచ్చిన భక్తులు బొడ్మట్‌పల్లి మీదుగా నాగ్సాన్పల్లి కమాన్ మీదుగా ఏడుపాయల చేరుకున్నారు. ఏడుపాయలకు చేరుకున్న భక్తులు ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. తెలంగాణ ఆచారాల ప్రకారం వనదుర్గా సన్నిధిలో ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కోళ్లు, మేకలుకోసి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు.
అలరించిన బోనాలు..
వనదుర్గమ్మకు భక్తులు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. నెత్తిన బోనం ఎత్తుకుని, నృత్యాలు చేస్తూ, విన్యాసాలు ప్రదర్శిస్తూ వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వినూత్న వేషధారణతో ఒంటికాలితో నృత్యం చేస్తూ, నోట్లో కత్తి పట్టుకుని నెత్తిపై దొంతర బోనాలు పెట్టుకొని అమ్మవారికి బోనాలు సమర్పించడం చూపరులను ఆకట్టుకున్నది.
నేడు రథోత్సవం..
మూడు రోజుల పాటు జరిగే దుర్గాభవానీ అమ్మవారి జాతరలో మూడో రోజైన గురువారం రథోత్సవం నిర్వహించనున్నారు. జాతరలో చివరి ఘట్టం రథోత్సవం కాగా, కార్యక్రమం రాత్రి సమయంలో కొనసాగుతుంది. రథం గోలి వద్ద ప్రారంభమై రాజగోపురం వరకు కొనసాగుతుంది. కార్యక్రమాన్ని వేలాది మంది తిలకిస్తూ, పాల్గొంటారు.