తూప్రాన్, డిసెంబర్ 30 : తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటాపూర్ (పీటీ)లో కొలువై ఉన్న లలితా పరమేశ్వరీదేవీ ఆలయ మహోత్సవాలు నేటితో ముగియనున్నాయి. లలితా సేవా సమితి తూప్రాన్ వారి ఆధ్వర్యంలో లక్ష్మీగణపతి, శ్రీరుద్ర స్వాహకార పూర్వక సహస్ర చండీ యాగ మహోత్సవాలు పంచాహ్నిక దీక్షతో ఈ నెల 27 నుంచి ఘనంగా నిర్వహిస్తున్నారు. సహస్ర చండీ యాగ భూషణ బిరుదాంకితులు, దేవీ ఉపాసకులు, ఆలయ వ్య వస్థాపకులు సోమయాజుల రవీంద్రవర్మ ఆధ్వర్యంలో లలితా పరమేశ్వరీ అమ్మవారి స్వప్నాదేశముతో లక్ష్మీగణపతి, రుద్ర స్వాహాకార పూర్వక అస్టోత్తర సహస్ర చండీ యాగం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. లలితా పరమేశ్వరీ దేవీ ఆలయాన్ని రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ సందర్శించారు. అమ్మవారికి మహాపూజ ఘనంగా నిర్వహించి, ప్రవచనాలు వినిపించారు. భక్తి భావమే మనిషిని సన్మార్గంలో నడిపిస్తున్నదని, భక్తితోనే ముక్తి లభిస్తుందన్నారు. సాటి మనుషులు, మూగజీవాలపై ప్రేమ భావం కలిగి ఉండాలన్నారు.
శుక్రవారం వేదస్వస్తితో పూజా కార్యక్రమాలు ఆరంభమయ్యాయి. అనంతరం స్థాపిత దేవతా పూజలు, అమ్మవారికి చతుష్ట్యు పచార పూ జ, మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మీగణపతి, శ్రీరుద్ర, చండీ హవనములు, మధ్యాహ్నం ముత్యంపేట గౌరీ శంకర ముదిగొండ అమరనాథ శర్మచే యుగళావధానం, శ్రీమతి కొరిడే హరిణాపవన్కుమార్చే గేయ రామాయణం-హరికథా గానం, సాయంత్రం ధూళిపాల శివరామకృష్ణ భగవతార్, గుంటూరు వారిచే హరికథా కాలక్షేపము, స్థాపిత దేవతా హవనం, చండీ హవనము, ప్రదోష పూజ, రాజోపచారములు, మంగళహారతులు, మంత్రపుష్పం, నిత్యాన్నదాన కార్యక్రమాలు కొనసాగాయి.