సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 21: రైతుల శ్రేయస్సుకు కృషి చేయాలని, సలహాలు, సూచనలు ఇవ్వడంలో డీలర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు ముందుండాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం డిప్లమా ఇన్ అగ్రికల్చర్, ఎక్ట్సెన్షర్ ఫర్ ఇన్పుట్ సర్వీస్ లో శిక్షణ పూర్తి చేసుకున్న డీలర్లకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డీలర్లు రైతులకు శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. డీలర్లు ముందుగా తాము శిక్షణ పొందిన విషయాలను సాగులో ఆయా పద్ధతులు పాటించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తనాలు, ఎరువులు పంట మార్పిడిపై సలహాలివ్వాలన్నారు.
వరి వెదజల్లే పద్ధతి, భూ సాంద్రత మేరకు ఎరువులు ఏ మోతాదులో వాడా లి, సాగులో అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ రంగంలో నూతన టెక్నాలజీ అందిపుచ్చుకునేలా ప్రోత్సహించాలన్నారు. అధిక దిగుబడులతో ఆదాయం వచ్చేలా మెళకువలు నేర్పాలన్నా రు. ఉత్తమ పద్ధతులు పాటించి రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి పొందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ నరసింహరావు, ఏడీఏలు, శిక్షణ పొందిన డీలర్లు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయి నుంచే గ్రీవెన్స్ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ శరత్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డితో కలిసి అర్జీలు తీసున్నారు. జిల్లా నలుమూలల నుంచి 15 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లాగ్షిప్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రజావాణికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అర్జీలు వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. అర్జీలను వెంటనే పరిశీలించి ఆయా సమస్యలకు పరిష్కారం చూపాలన్నా రు. రెవెన్యూ శాఖకు సంబంధించి వారం రోజులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. సమస్యల పరిష్కారం క్షేత్రస్థాయి నుంచి జరిగితే త్వరితగతిన పూర్తవుతాయన్నారు. ఆసరా పింఛన్లో అర్హత గలవారు ఎవరైనా మిగిలితే వారిని గుర్తించి జాబితాను ప్రభుత్వానికి పంపాలని డీఆర్డీవో శ్రీనివాసరావుకు సూచించారు.