రాష్ట్ర వ్యాప్తంగా కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. 2018లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్‌లో సీఎం కేసీఆర్ దీనికి శ్రీకారం చుట్టారు. జిల్లాలో మొత్తం 7,67,616 జనాభా ఉండగా, మొదటి విడుతలో భాగంగా 4,39,316 మందికి వైద్య సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న వాళ్లకి ఉచితంగా కండ్లద్దాలు అందజేశారు. పలువురికి శస్త్రచికిత్సలు చేశారు. 20 పీహెచ్‌సీల్లో 20 బృందాలు ఏడున్నర నెలల పాటు వైద్యశిబిరాలు నిర్వహించి చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరికీ పరీక్షలు చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. ఇదే ఉత్సాహంతో వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రెండో విడుతను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు కావాల్సిన సిబ్బంది, కండ్లద్దాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
మెదక్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మెదక్ జిల్లాలోనే పురుడుపోసుకున్నది. రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలందించాలని ఈ కార్యక్రమం రూపుదిద్దుకుంది. ప్రభుత్వ ఖర్చుతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కండ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15, 2018న మెదక్ జిల్లా మల్కాపూర్‌లో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. ఈ పథకం జిల్లాలో ఏడున్నర నెలల పాటు కొనసాగింది. ఇందుకు రూ.106 కోట్లు కేటాయించారు.
మెదక్ జిల్లాలో 4 లక్షలా 39వేల మందికి కంటి పరీక్షలు
మెదక్ జిల్లాలో 7,67,616 మంది జనాభా ఉన్నారు. కంటి వెలుగు కార్యక్రమంలో 4,39,316 మందికి కంటి పరీక్షలు చేశారు. 63,375 (రీడింగ్ గ్లాస్) కండ్లద్దాల కోసం ప్రతిపాదనలు పంపగా, 61,695 కండ్లద్దాలు పంపిణీచేశారు. దృష్టి లోపం ఉన్న వారిలో 35,158 మందికి కండ్లద్దాలు అందజేశారు. జిల్లాలోని 372 పంచాయతీలు, జిల్లా కేంద్రంలోని నాలుగు వార్డుల్లో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. జిల్లాలో 20 పీహెచ్‌సీల్లో 20 బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఒక్కో టీం 151 మందికి పరీక్షలు చేశారు. ఎక్కడా లోపం లేకుండా ప్రతీ గ్రామంలో ప్రజలకు లబ్ధి చేకూరేలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో ఒక మెడికల్ ఆఫీసర్, కంటి వైద్యుడు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్లు, ఆశ వర్కర్లతో కూడిన బృందం సేవలందించింది. ఒక్కో క్యాంపులోని వైద్య బృందం రోజుకొకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో 250 మందికి, పట్టణ ప్రాంతాల్లో 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
వయస్సుతో సంబంధం లేకుండా…
కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ దృష్టి లోపంతో బాధపడుతున్న జిల్లా ప్రజలకు వయస్సుతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్య పరీక్ష, శస్త్ర చిక్సిత, కండ్లద్దాలు అందించారు. అవసరమైన వారికి మందులు కూడా ప్రభుత్వం ఉచితంగా అందజేసింది. కంటి జాగ్రత్తలు, ఆరోగ్యానికి సంబంధించిన అవగాహనను ఈ కార్యక్రమంలో కల్పించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని కంటి వెలుగు క్యాంపులు నిర్వహించారు. ఇందులో ప్రజలకు నాణ్యమైన కంటి అద్దాలు పంపిణీ చేశారు.
జనవరి 18 నుంచి రెండో విడత
రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 18 నుంచి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించారు. గతంలో ఈ కార్యక్రమం ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నది. ముఖ్యంగా చూపు కోల్పోయిన పేదలైన వృద్ధులకు ఈ కార్యక్రమం ప్రయోజనకరంగా మారింది. తద్వారా వారు పొందిన ఆనందానికి అవధులు లేవు. అందువల్ల మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమం కింద ఉచితంగా నేత్ర పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారందరికీ ఉచితంగా కంటి అద్దాలు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు అవసరమైన సిబ్బందిని, కండ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం కేసీఆర్ వైద్యాధికారులకు సూచించారు.
మొదటి విడత విజయవంతం
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం మెదక్ జిల్లాలోని తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో 2018, ఆగస్టు 15న సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం మెదక్ జిల్లాలో ఏడున్నర నెలలు కొనసాగింది. జిల్లాలో 20 పీహెచ్‌సీల్లో 20 బృందాలు పాల్గొన్నాయి. జిల్లాలో 372 పంచాయతీల్లో, జిల్లా కేంద్రంలోని 4 వార్డుల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 4,39,316 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. రెండో విడత కార్యక్రమానికి అవసరమైన సిబ్బంది, కండ్లద్దాలు, పరికరాలు ఇతర ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి.
– డాక్టర్ విజయనిర్మల, డీఎంహెచ్‌వో, మెదక్