గజ్వేల్, నవంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ భారీగా నిధులు ఖర్చుచేస్తున్నదని, అయినా కొందరు కుహానా మేధావులు ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వాన్ని బద్నామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా గజ్వేల్ మహతి ఆడిటోరియంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
సమావేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హరీశ్‌రావు హాజరై ప్రసంగించారు. రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఉపాధ్యాయులందరినీ కలువడం చాలా సంతోషంగా ఉందన్నారు. సమాజంలో అబద్ధాలను వ్యాపింప చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతున్నదని, అలాంటి వారికి నిజాలు తెలియాలన్నా, పాలకుల్లో మార్పు రావాలన్నా సమాజంలో చర్చ జరగాలన్నారు. ప్రజల్లో చర్చ జరిగేలా ఉపాధ్యాయులు కృషిచేయాలన్నారు.
ఇతర రాష్ర్టాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. అనేక రంగాల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా మారిందని తెలిపారు. మంచి, చెడును విశ్లేషించిన నాయకత్వం కలిగిన ఉపాధ్యాయులు.. ఈ రోజు సమాజానికి నిజాన్ని , రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రం వచ్చినప్పుడు ఎంబీబీఎస్ సీట్లు 850 మాత్రమే ఉన్నాయని, ఇప్పుడు 2950 పెరిగాయన్నారు. ఇదంతా కేవలం సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే సాధ్యమైందని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉస్మానియా, గాంధీ కాకుండా మరో మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు. ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నామని, ఇప్పటి వరకు 12 నూతన మెడికల్ కాలేజ్‌లు ప్రారంభించడంతో రాష్ట్రంలో మెడికల్ కాలేజీల సంఖ్య 17కు చేరిందని తెలిపారు. వచ్చే సంవత్సరం మరో 9 మెడికల్ కాలేజ్‌లు ప్రారంభించబోతున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు.
2014లో విద్యపై రూ.9518 కోట్లు ఖర్చు చేస్తే, ఇప్పుడు రూ.25,250 కోట్లు ఖర్చు పెడుతున్నానన్నారు. రాష్ట్ర బడ్జెట్లో 10శాతం ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని మంత్రి వెల్లడించారు. ‘మనఊరి-మనబడి’ ద్వారా అన్ని పాఠశాలలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ జీడీపీ ఇప్పటికీ మనకంటే రూ.1,50,000 తక్కువగా ఉందని, ఇది ఆర్బీఐ వెల్లడించిన నిజమేనన్నారు. కాళేశ్వరం నీళ్లు రావడంతో ఈ రోజు తెలంగాణలో పండిన పంట కొనలేనంత బరువు కేంద్రానికి ఎందుకయ్యిందని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
భూమికి బరువయ్యేలా పంటలు..
రాష్ట్రంలో భూమి బరువయ్యేలా పంటలు పండుతున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 2014 నాటికి సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలు ఉంటే, నేడు 2.30 కోట్ల ఎకరాలకు చేరిందని ఆయన చెప్పారు. 11.50లక్షల ఎకరాలకు ఉద్యానపంటల సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. 2014-15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68లక్షల టన్నులు మాత్రమే కాగా, 2021-22 సంవత్సరానికి 2.49 కోట్ల టన్నులకు చేరిందన్నారు. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50కోట్లకు చేరుకున్నదన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి బావుల వద్ద మీటర్లు పెట్టలేదనే కారణంతో కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రూ.6వేల కోట్లు, ఎఫ్ఆర్బీఎం కింద రూ.15వేల కోట్లు ఆపిందన్నారు. మొత్తం 21 వేల కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సి ఉందన్నారు. అందుకే ఈ రోజు రాష్ట్రంలో కొంత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సీఎం కేసీఆర్ అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని తెలిపారు.
పీఆర్టీయూ గౌరవాన్ని పెంచారు..
పీఆర్టీయూ గౌరవాన్ని పెంచే విధంగా సీఎం కేసీఆర్ ఉపాధ్యాయులకు న్యాయం చేశారని, తెలంగాణ రాష్ట్రంలోనే ఉపాధ్యాయ, ఉద్యోగులకు సముచిత గౌరవం దక్కుతున్నదని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. త్వరలో ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ పూర్తి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు ఎలాంటి సమస్యలు వచ్చినా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
త్వరలో ఎంప్లాయిస్ హెల్త్ కార్డు విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ రోజా శర్మ, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావు, ఆయా జిల్లాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు, సంఘాల బాధులు పాల్గొన్నారు.
కాగా సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శశిధరశర్మ, పీఆర్టీయూ జిల్లా బాధ్యులను అందరూ అభినందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పంతం వెంకటరాజం, పత్రిక సంపాదకవర్గ సభ్యుడు ఊడెం జైపాల్‌రెడ్డి, గౌరవాధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, నర్సింహారెడ్డి, తిరుపతిరెడ్డి, మండలాధ్యక్షులు వేమారెడ్డి, భాస్కర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఆగంరెడ్డి, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్, రాష్ట్రంలోని ఆయా జిల్లాల, మండలాల బాధ్యులు, ఉపాధ్యాయలు 2 వేల మంది సమావేశానికి హాజరయ్యారు.