జహీరాబాద్/న్యాల్కల్, నవంబర్ 17: అతని కుంచే నుంచి జాలువారిన చిత్రం అద్భుతం. గీసిన ప్రతి లైను ఆలోచింపజేస్తుంది. అతనికే సొంతం. పిట్ట కొంచెం కూత గణం అనడంలో అతిశయోక్తి లేదు. చిత్ర లేఖనం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఓ వైపు చదువుకూంటూనే చిత్రాలు గీస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రా మానికి చెందిన గున్నాల సాయికిరణ్ చిన్ననాటి నుంచే చదువుతో పాటు బొమ్మలు వేయాలన్న ఆసక్తి సాయికిరణ్లో ఉండేది. చదువుకునే సమయంలో తీరిక దొరికినపుడల్లా పెన్ను, పెన్సిల్‌తో తన ఊహల్లోకి వచ్చిన ద్యశ్యాలను గీసేవాడు.
జీవకళ ఉట్టిపడేలా గీస్తున్న చిత్రాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని వర్గల్ నవోదయ గురుకుల పాఠశాలలో పని చేస్తున్న డ్రాయింగ్ టీచర్ స్ఫూర్తితో తన సృజనాత్మకతతో వెలికితీశాడు. సాయికిరణ్ చేతి నుంచి జాలు వారిన అద్భుత చిత్రాలెన్నో ప్రశంసలు అందుకున్నాయి. చిత్రాలే కాదు చదువులో కూడా రాణిస్తున్నాడు. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు వర్గల్ నవోదయలో చదువుకుని వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించి పాఠశాలలో రెండోస్థానం నిలిచాడు. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ‘దక్షిణ పరీక్ష’లో పాసై బెంగళూర్ నవోదయలో ఇంటర్ సీటు సంపాదించి అక్కడే ఇంటర్ చదివాడు.
ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్ పరీక్షలో సాయికిరణ్ ఆలిండియాలో ఓబీసీలో 281ర్యాంకు సాధించి, ప్రస్తుతం దేశ రాజధాని న్యూఢిల్లీ ఐఐటీలో మ్యాథమెటిక్ కంప్యూటర్ సైన్స్‌లో మూడో సంవత్సరం చదువుతున్నాడు. సెప్టెంబర్ మాసంలో న్యూఢిల్లీలోని ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సాయికిరణ్ గీసిన చిత్రాన్ని ఐఐటీ డైరెక్టర్ రజన్ బెనార్జి అందజేశారు. దీంతో తన బొమ్మను చక్కగా చిత్రీకరించవు అంటూ రాష్ట్రపతితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ సాయికిరణ్‌ను అభినందించారు. ప్రముఖులు, సినిమా హీరోలు, సందేశాత్మక అద్భుతమైన చిత్రాలను గీశారు.
చదువు, చిత్రలేఖనంలో రాణించడమే లక్ష్యం
చదువు, చిత్రలేఖనంలో రాణించి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే లక్ష్యం. చిన్నప్పట్టి నుంచే చదువు, చిత్ర లేఖనంపై ఆసక్తి ఉండేది. వర్గల్ నవోదయ పాఠశాలలో చదువుకునే సమయంలో డ్రాయింగ్ టీచర్ చిత్రలేఖనంలో మెళకువలను నేర్పించారు. ఆ మెలుకువలతో వీలు దొరికనప్పుడు పెన్సిల్, పెన్ను, కుంచెలతో చిత్రాలను చిత్రీకరిస్తుంటాను. పాఠశాలలో చదువుకునే సమయంలో చిత్రలేఖన పోటీలో పాల్గొని బహుమతులను సాధించాను. రాష్ట్రపతి ద్రౌపది బొమ్మ ను చిత్రీకరించాను. న్యూ ఢిల్లీలోని ఐఐటీ క్యాంపస్‌లో జరిగిన 60 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో నేను చిత్రీకరించిన రాష్ట్రపతి బొమ్మను ఐఐటీ డైరెక్టర్ అందచేశారు. రాష్ట్రపతి బొమ్మను స్వయంగా ఇవ్వాల్సి ఉండగా భద్రత దృష్ట్యా నేరుగా ఇవ్వలేకపోయాను. చక్కగా బొమ్మను గీశావంటూ రాష్ట్రపతితో పాటు కేంద్ర విద్యశాఖ మంత్రి అభినందించడం సంతోషంగా ఉంది.
– సాయికిరణ్ గున్నాల