మునిపల్లి, నవంబర్ 18: జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి నాలుగు రోజుల పాటు జాతరను కన్నుల పండువలా నిర్వహించేందుకు నిర్వాహకులు అంతా సిద్ధం చేశారు. ఈ వేడుకలకు రాష్ట్రంతో పాటు పక్క రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. అందోల్ ఎమ్మెల్యేలుగా ఎవరు పోటీ చేసినా నామినేషన్ వేసే ముందు ఈ ఆలయంలో పూజలు చేస్తే తప్పక విజయం వరిస్తుందని నమ్ముతారు. ముంబై జాతీయ రహదారి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని అంతారంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవాలంటే ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
తెలంగాణ రాష్ట్రంలోనే పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పేరుగాంచిన జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఉత్సవాలు ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి ఘనంగా నిర్వహించేందుకు పాండురంగ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబైంది. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని అంతారంలో 367 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఏటా కార్త్తిక బహుళ దశమి నుంచి బహుళ చతుర్దశి వరకు జీవన్ముక్త పాండురంగ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఉత్సవాలు ఈనెల 19 నుంచి 22 వరకు నాలుగురొ రోజుల పాటు కొనసాగుతాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి జీవన్ముక్త పాండురంగ మహారాజ్‌ను దర్శించుకుంటారు.
ఎమ్మెల్యేలకు సెంటిమెంట్ ఆలయం..
అందోల్ నియోజకవర్గం నుంచి పోటీచేసే ఎమ్మెల్యే అభ్యర్థులు నామినిషన్ వేసే ముందు జీవన్ముక్త పాండురంగ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఎమ్మెల్యేలు గెలిచిన వెంటనే అంతారం ఆలయంలో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంటారు.ఎన్నికల్లో పోటీచేసే వారు అంతారం ఆలయాన్ని సెంటిమెంట్‌గా భావిస్తారు.
జాతీయ రహదారికి 5కిలోమీటర్ల దూరం..
జీవన్ముక్త పాండురంగ మహారాజ్ ఆలయం మునిపల్లి మండలం అంతారంలో ఉంది.ముంబయి జాతీయ రహదారిపై గల కంకోల్ గ్రామం నుంచి అంతారం వరకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతారం గ్రామానికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలు,ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
భక్తులు తరలి రావాలి..
ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలి. అంతారంలో ఈసారి ఉత్సవాలకు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాం. నాలుగు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తాం.
– శంకర్,అంతారం సర్పంచ్