పంట సాగు, గృహ నిర్మాణాల కోసం చెట్ల నరికివేత
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
పట్టించుకోని అటవీశాఖ అధికారులు
జహీరాబాద్, మార్చి 1 : పంట సాగు .. వంట చెరకు.. రహదారి విస్తరణ.. విద్యుత్ లైన్ల ఏర్పా టు.. గృహ నిర్మాణం కోసం కారణమేదైనా అడవిలోని చెట్లను యథేచ్ఛగా నరికివేస్తున్నారు. అభయారణ్యాన్ని మైదానంగా మారుస్తున్నారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం ఏటా హరితహారంలో భాగంగా లక్షల మొక్కలు నాటుతున్నది. నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీలు, అటవీశాఖ అధికారులు చూస్తున్నారు. వన సంరక్షణను అటవీశాఖ అధికారులు గాలికొదిలేశారు. జహీరాబాద్ ఫారెస్టు రేంజ్ పరిధిలోని మొగుడంపల్లి మండలం గుడుపల్లి, ఔరంగనగర్ శివారులో గల అడవిలో ఉన్న చెట్లను నరకివేస్తున్నారు. అటవీశాఖ అధికారుల ప్రోత్సాహంతో చెట్లను నరికి తరలిస్తున్నారనే ఆరోపణలు ఉన్నా యి. అటవీశాఖకు ఆదాయం సమకూర్చాల్సిన నీలగిరి ప్లాంటేషన్లు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తుందనే విమర్శలు ఉన్నాయి. వందలాది ఎకరాల అటవీ భూముల్లో వేసిన నీలగిరి చెట్లపై అధికారుల నిఘా లేకపోవడంతో నరికివేతకు గురవు తున్నాయి. అటవీశాఖలో పని చేస్తున్న కొంతమంది చేతివాటంతో అక్రమ రవాణా జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
జహీరాబాద్ అటవీశాఖ రేంజ్ పరిధిలో ఉన్న చెట్లను నరికివేయడంతో అడవి కనుమరుగైపోతున్నది. జహీరాబాద్ రేంజ్ పరిధిలోని మొగుడంపల్లి మండలం గుడుపల్లితోపాటు కోహీర్, న్యాల్కల్ మండలంలో ఉన్న అటవీ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. అటవీ భూమిలో ఉన్న చెట్లను నరికి వంట సరుకుగా వినియోగిస్తున్నారు. నీలగిరి చెట్లను నరికి కొందరు ఇండ్ల నిర్మాణం కోసం వినియోగిస్తున్నారు. మొగుడంపల్లి అటవీ ప్రాంతం కర్ణాటక సరిహద్దులో ఉన్నందు అక్కడి కలప వ్యాపారులు రా త్రి సమయంలో ఇక్కడి చెట్లను నరికి వాహనంలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని తెలిసింది. గిరిజన రైతులు అటవీ భూములో ఉన్న చెట్లను నరికి వ్యవసాయ భూములుగా మార్చుతున్నారు. గృహ నిర్మాణం కోసం ఏటా అటవీ ప్రాంతంలో ఉన్న చెట్లలను నరకడంతో అటవీ ప్రాంతం అంతరించిపోతున్నది. మొగుడంపల్లి మండలం ఔరంగనగర్, గుడ్పల్లి శివారులో ఉన్న చెట్లను అక్రమంగా నరికి తరలిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అటవీశాఖ అధికారుల ప్రోత్సాహంతో చెట్లను నరుకుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
కొందరు అధికారులు కర్ణాటక వ్యాపారుల నుంచి మామూళ్లు తీసుకొని అక్రమ కలప వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జహీరాబాద్‌లో అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేక చెట్లు నరికినా చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అటవీశాఖ చెక్‌పోస్టు జాతీయ రహదారిపై ఏర్పాటు చేయకపోవడంతో కలప వ్యాపారులు నిర్భయంగా తరలిస్తున్నారు. సరిహద్దులో ఉన్న అటవీశాఖ చెక్‌పోస్టు 65వ జాతీయ రహదారిపై లేకపోవడంతో కలప స్మగ్లింగ్ జోరుగా కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్, న్యాల్కల్ మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. సరిహద్దు రోడ్లుపై ఎలాంటి చెక్‌పోస్టులు లేవు. దీంతో కలప స్మగ్లింగ్ జోరుగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రేంజ్ పరిధిలో ఉన్న అధికారుల నిర్లక్ష్యంతో కలప స్మగ్లింగ్ పెరిగిపోయిందనే విమర్శనాలు ఉన్నాయి.