సదాశివపేట, నవంబర్ 18: గ్రామాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం మండలంలోని నాగులపల్లి, కోనాపూర్, ఆరూర్, మెలిగిరిపేట, తంగెడపల్లి, మద్దికుంట, కంబాలపల్లి, నాగ్సాన్పల్లి, పెద్దాపూర్ గ్రామాల్లో ఎస్డీఎఫ్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించనున్న డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను స్థానిక సర్పంచ్‌లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. సంగారెడ్డి నియోజకవర్గానికి రూ.17 కోట్ల నిధులు కేటాయించారని, మండలానికి సంబంధించి రూ.5కోట్ల 80లక్షల నిధులు కేటాయించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా 9 గ్రామాల్లో రూ.1.80 కోట్ల పనులు ప్రారంభించుకున్నామన్నారు. ఆయా పనులు నాణ్యత లోపిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో అభివృద్ధితో గ్రామాల రూపురేఖలు మారుతాయని స్పష్టం చేశారు. అంతకుముందు పనుల ప్రారంభానికి విచ్చేసిన చింతా ప్రభాకర్‌కు ఆయా గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలికారు.
డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచ్‌లు చింతా ప్రభాకర్‌కు శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, ఎంపీపీ తొంట యాదమ్మ, ఎంపీడీవో పూజ, సొసైటీ చైర్మన్ రత్నాకర్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, హరిపొద్దీన్, ఎంపీటీసీలు సునీతా సుధాకర్, లలితామాధవరెడ్డి, సత్యనారాయణ, సంతోష్‌గౌడ్, హైమద్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నవీన్‌కుమార్, సర్పంచ్‌లు యేసయ్య, లక్ష్మారెడ్డి, సంగమేశ్వర్, హన్మంత్‌రెడ్డి, సిద్ధన్న, మధు, శ్రీహరి, శేఖర్, శ్రీనివాస్, సలావుద్దీన్, రాములు, నరేశ్‌గౌడ్, అశోక్‌కుమార్, కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.