మానవ సేవయే మాధవ సేవ అని నమ్మి విద్య, వైద్యం, పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సత్యసాయి ట్రస్ట్ సింబల్ ఆఫ్ చారిటీగా నిలిచిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సంజీవని చిన్నపిల్లల గుండె చికిత్స పరిశోధనా కేంద్రాన్ని’ గురువారం సద్గురు మధుసూదనా సాయితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణాదిలో తొలి సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో కొండపాకకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ సెంటర్ యావత్ తెలంగాణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు. ప్రభుత్వం తరపున
అన్ని జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి, వారికి ఈ దవాఖానలో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సెంటర్ ఏర్పాటుకు కృషిచేసిన కేవీ రమణాచారి, మధుసూదన సాయికి ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కొండపాక, నవంబర్ 17 : విద్య, వైద్యం, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ సత్యసాయి ట్రస్ట్ సింబల్ ఆఫ్ చారిటీగా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక ఆనంద నిలయం ఆవరణలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి సత్యసాయి సంజీవని చిన్నపిల్లల గుండె చికిత్స పరిశోధన కేంద్రాన్ని గురువారం సద్గురు మధుసూదన్ సాయితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే ఉచిత గుండె ఆపరేషన్ చికిత్సలు చేసే దవాఖానను సత్యసాయి ట్రస్ట్ ఏర్పాటు చేయడంతో కొండపాకకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రతి వంద మందిలో ఒక చిన్నారి గుండె సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి దవాఖాన ఏర్పాటుతో ఈ ప్రాంత ప్రజలకే కాకుండా తెలంగాణ మొత్తం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.]
ఈ సందర్భంగా సద్గురు మధుసూదన సాయి మాట్లాడుతూ.. గతేడాది సత్యసాయి విద్యాలయ ప్రారంభోత్సవ సమయంలో వైద్యాలయం కావాలని మంత్రి హరీశ్‌రావు కోరారని, ఆయన కోరిక మేరకు నేడు కొండపాక ఆనంద నిలయం వద్ద వైద్యాలయం ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు ఈ వైద్యాలయం ద్వారా వైద్యసేవలు, చికిత్సలు అందిస్తామని తెలిపారు. మానవ సేవయే మాధవసేవ అని సద్గురు మధుసూదన సాయి అన్నారు. ఆ మార్గంలోనే సత్యసాయి ట్రస్ట్ విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. నవంబర్ 23న సత్యసాయిబాబా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వైద్యాలయం ప్రారంభించుకున్నట్లు తెలిపారు. ఈ వైద్యాలయం త్వరగా పూర్తయ్యేలా కృషి చేసిన మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జడ్పీ చైర్పర్సన్ రోజారాధకృష్ణశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, జడ్పీటీసీ అనంతుల అశ్వినీ ప్రశాంత్, ఎంపీపీ ర్యాగల్ల సుగుణ దుర్గయ్య, కొండపాక సర్పంచ్ చిట్టి మాధురి, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధులు జగన్నాథశర్మ, కొండలరావు, ఆయుష్ కమిషనర్ ప్రశాంతి, ఆనంద నిలయం ట్రస్ట్ ప్రతినిధులు పెద్ది వైకుంఠం, బెజగామ వెంకటేశం, గట్టు రవి, టీఆర్ఎస్ నాయకులు దేవీ రవీందర్, గడాల భాస్కర్‌రెడ్డి, లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ర్యాగల్ల దుర్గయ్య, అనంతుల ప్రశాంత్, కోల సద్గుణ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం తరపున రా్రష్ట్రంలోని అన్ని జిల్లాల్లో శిబిరాలు ఏర్పాటు చేసి గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతున్న చిన్నారులను గుర్తించి, వారికి ఈ దవాఖానలో చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీశ్‌రావు ఈ సందర్భంగా చెప్పారు. ఈ దవాఖానకు ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కొండపాకలో దవాఖాన ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. రూ.50కోట్లతో 100 పడకలతో అధునాతనంగా ఈ దవాఖాన ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు అదృష్టం అన్నారు. సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో పేద ప్రజలకు విద్య, వైద్యం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందించడంపై మంత్రి అభినందనలు తెలిపారు. ఎవరి శక్తి మేరకు వారు ఆపదలో ఉన్న వారికి ప్రజాహిత సేవలు అందించడం ద్వారా ఆనందం దక్కుతుందన్నారు.
కొండపాకలో సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యాలయం, వైద్యాలయం, ఆనంద నిలయం ఏర్పాటుకు కృషిచేసిన.. కర్త, కర్మ, క్రియగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారికి ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన కృషితోనే ఇక్కడ ఇవన్నీ సాధ్యమైనట్లు తెలిపారు.