జహీరాబాద్, నవంబర్ 12:చదువుతో పాటు క్రీడాల్లో నూ బాలికలు రాణించాలని, క్రీడాకారుల్లో క్రమశిక్షణ, గెలుపోటములు తట్టుకోనే శక్తి ఉంటుందని జహీరాబాద్ డీఎస్పీ వి.రఘు అన్నారు. శనివారం జహీరాబాద్ మండలంలోని రంజోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి మల్టీ జోన్-2 స్పోర్ట్స్ మీట్ ముగింపు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు జహీరాబాద్ ప్రాంతంలో నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్నో జిల్లాల నుంచి బాలికలు స్పోర్ట్స్ మీట్లో పాల్గొని, ఆటలు ఆడి గెలుపొందడం ఆనందంగా ఉందన్నారు. క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను కనబరించిన వారికి అభినందనలు తెలిపారు. క్రీడాల్లో గెలుపోటములు సహజమని, వాటిని తట్టుకునే శక్తి ప్రతి క్రీడాకారుడికి ఉండాలని అన్నారు. ఓటమి చెందిన బాలికలు గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్నారు. తరగతిలో ఒక విద్యార్థి మంచి మార్కులు సాధించిన వెంటనే మరో విద్యార్థి మంచి మార్కులు సాధించేందుకు ప్రయత్నం చేస్తారని, అలాగే ఓటమి చెందిన వారు గెలుపు కోసం కష్ట పడాలని అన్నారు. ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు కష్ట పడి స్పోర్ట్స్ మీట్‌ను విజయవంతం చేయడంతో వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత చదవులు చదివి మంచి స్థానంలో నిలువాలని ఆకాంక్షించారు. జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదురుకుని ముందుకు పోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో మంచి సౌకర్యాలు కలిపించి, నాణ్యమైన విద్యా బోధన చేస్తున్నదన్నారు. గతంలో మీ తల్లిదండ్రులు చదువుకున్న పాఠశాలల్లో ఎలాంటి గదులు ఉండేవి, వసతి గృహాల్లో ఎలాంటి సౌకర్యాలు ఉండేవో అడిగి తెలుసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్సీవో భీమయ్య, రంజోల్ పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణవేణి, వివిధ విభాగాల అధికారులు, ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.