సంగారెడ్డి జిల్లాలో..
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. సర్కార్ బడులకు ‘మనఊరు- మనబడి’ కార్యక్రమంతో సీఎం కేసీఆర్ జీవం పోశారు. భవనాల ఆధునీకరణ, బెంచీలు, కుర్చీలు, మరుగుదొడ్ల ఏర్పాటు, నీటి వసతి, విద్యుద్ధీకరణ, కిచెన్షెడ్లు, డైనింగ్‌హాళ్ల నిర్మాణం తదితర 12 రకాల అభివృద్ధి పనులను ఇందులో చేపడుతున్నది. మూడు దశల్లో మూడేండ్లలో అన్ని పాఠశాలలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, మొదటి విడుతలో మెదక్ జిల్లాలో 313, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలను ఎంపిక చేసింది. పలుచోట్ల ఇప్పటికే పనులు పూర్తవగా, మరికొన్ని సూళ్లల్లో వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్లు శరత్, హరీశ్ ఎప్పటికప్పుడు విద్యా, ఇంజినీరింగ్ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోగా లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు.
సంగారెడ్డి/ మెదక్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సర్కారు ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించటంతోపాటు ఆంగ్లబోధన అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ‘మనఊరు-మనబడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా సకల సౌకర్యాలు కల్పించటంతోపాటు డిజిటల్, ఆంగ్ల విద్యాబోధన అందుబాటులోకి తీసుకువస్తున్నారు. మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో మొదటి విడుతలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రారంభించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. పనులు పూర్తయిన పాఠశాలలు ప్రస్తుతం రూపుమార్చుకుని ఔరా..! అనిపించేలా కనువిందు చేస్తున్నాయి.
మెదక్ జిల్లాలో 898 పాఠశాలలు ఉండగా, మొదటి విడతలో 313 పాఠశాలల్లో 44 ప్రాథమిక పాఠశాలలు, 180 ప్రాథమికోన్నత పాఠశాలలు, 89 ఉన్నత పాఠశాలలున్నాయి. ఇందులో ఇప్పటి వరకు 240 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. దశలవారీగా చేపట్టిన మనఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే వందలాది పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన ప్రారంభమైంది. మెదక్ జిల్లాలో 313 పాఠశాలల్లో రూ.5 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.
మనఊరు-మనబడి ద్వారా ప్రభుత్వపాఠశాలలను ఆధునీకరణ పనుల్లో పూర్వ విద్యార్థులను, ప్రజలను, కార్పొరేట్ పరిశ్రమలను భాగస్వాములను చేస్తున్నారు. పూర్వ విద్యార్థులు, ప్రజలు, కార్పొరేట్ పరిశ్రమల యాజమాన్యాల నుంచి విరాళాలను స్వీకరిస్తున్నారు. ఎన్ఆర్ఐలు సైతం తమ గ్రామం లేదా తాము చదువుకున్న పాఠశాలకు విరాళాలు ఇస్తే స్వీకరిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు మన ఊరు-మనబడి కార్యక్రమానికి రూ.3 లక్షల వరకు విరాళాలు వచ్చాయి. ఇంకా చాలా మంది విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.
మనఊరు-మనబడి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టింది. మూడు దశల్లో మూడేండ్ల పాటు విద్యాశాఖ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలల మౌలిక వసతులను మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నది. మొదటి దశలో ప్రభుత్వ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ పాఠశాలలో నీటి సౌకర్యంతో పాటు టాయిలెట్లు, విద్యుద్ధీకరణ, తాగునీటి సరఫరా, విద్యార్ధులు, సిబ్బందికి సరిపడే ఫర్నిచర్ అందించడం, పాఠశాలలు మొత్తం నవీకరించడం, మరమ్మతులు చేయడం, కిచెన్లు ఏర్పాటు, శిథిలమైన గదుల స్థానంలో కొత్త తరగతి గదులు ఏర్పాటు చేయడం, డిజిటల్ విద్య వంటి వాటిని అమలు చేయనున్నారు. ఎంపిక చేసిన పాఠశాలలో పనుల బాధ్యతలను జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. అంతేకాకుండా ప్రభుత్వం పూర్వవిద్యార్థులను కూడా పాఠశాలల అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తున్నది.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1262 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ‘మనఊరు-మనబడి’ కార్యక్రమం మొదటి విడతలో 441 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలు 363 ఉండగా, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలలు 78 ఉన్నాయి. ఎంపికచేసిన 441 పాఠశాలల్లో 256 ప్రాథమిక, 64 ప్రాథమికోన్నత, 124 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.
ఆయా పాఠశాలల్లో మొత్తం 80,757 మంది విద్యార్థులు చదువుతున్నారు. మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ఎంపిక చేసిన స్కూళ్లల్లో రూ.7 కోట్లతో పనులు చేపడుతున్నారు. 331 పాఠశాలల్లో రూ.30 లోపు నిధులతో పనులు చేపట్టగా, రూ.30 లక్షలకుపైగా నిధులతో 104 పాఠశాలల్లో పనులు చేపడుతున్నారు. ‘మనఊరు-మనబడి’లో భాగంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్‌శాఖకు 328 పాఠశాలల నిర్మాణం బాధ్యతలు, పబ్లిక్ హెల్త్ విభాగానికి ఎనిమిది పాఠశాలలు, ఇరిగేషన్ విభాగానికి 18 పాఠశాలలు, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీకి 87 పాఠశాలల నిర్మాణం పనుల బాధ్యతలు అప్పగించారు.