మూడు రోజుల పాటు జాతర
15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం
ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ, అధికారులు
విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్న ఆలయం
పాపన్నపేట, ఫిబ్రవరి27:మహాశివరాత్రి పర్వదినానికి పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం ముస్తాబైంది. రేపటి నుంచి మూడురోజుల పాటు నిర్వహించనున్న జాతర కోసం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది, అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏడుపాయల వనదుర్గా సన్నిధిలో మహాశివరాత్రిని పురస్కరించుకుని మూడు రోజుల పాటు జరుగనున్న జాతరకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ జాతరకు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. వీరికి అవసరమైన ఏర్పాట్ల కోసం జిల్లా అధికార యంత్రాంగం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నది. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, ఇతర జిల్లాస్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఏడుపాయలలోని హరిత రెస్టారెంట్లో సమీక్షా సమావేశం నిర్వహించి, దిశానిర్ధేశం చేశారు. జాతర సమీపిస్తున్నందున పనులన్నీ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. కలెక్టర్ హరీశ్ మెదక్ సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడుపాయలలో దేవాదాయ శాఖ కార్యాలయంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించి, ఏర్పాట్లను పరిశీలించారు.
జాతరలో ఎలాంటి ఘటనలు జరుగకుండా ఏమేమి చర్యలు చేపట్టాలనే విషయాన్ని స్వయంగా సంగారెడ్డి ఎస్పీ, మెదక్ ఇన్‌ఛార్జి ఎస్పీ రమణకుమార్ పరిశీలించి, అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. వీఐపీల క్యూలైన్లు, చలువ పందిళ్లు, టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. నాగ్సాన్పల్లి వైపు చెలిమెలకుంట వద్ద పోతంశెట్టిపల్లి వైపు రెండోబ్రిడ్జి వద్ద పార్కింగ్ కోసం స్థలాన్ని చదునుచేశారు. ఏడుపాయలలో అంతర్గత రోడ్లను మొరం పోసి చదునుచేశారు. ఘనపూర్ ఆనకట్టతోపాటు చెక్‌డ్యాం వద్ద నీటి ప్రమాదాలు జరుగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు వివరాలు తెలిసేలా సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. భక్తుల అవసరాల కోసం సింగూరు ప్రాజెక్టు నుంచి వనదుర్గా ప్రాజెక్టుకు నీటిని వదిలారు. భక్తులు స్నానాలు చేయడానికి దుర్గామాతా ఆలయం, చెక్‌డ్యాం, ఘనపూర్ ఆనకట్ట తదితర ప్రాంతాల్లో పది షవర్లు ఏర్పాటుచేశారు. మం జీర నదిలో ఉత్సవ శివలింగం ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. అదనపు ట్రాన్స్ఫార్మర్లు బిగించారు. తాత్కాలిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సబ్‌సెంటర్, జాతర ప్రాంగణంలో తాగునీటికి నల్లాల బిగింపు, పను లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో 33, పోలీసుశాఖ ఆధ్వర్యంలో 19 సీసీ కెమెరాల ఏర్పాటుచేశారు. జాతరకు పకడ్బందీ ఏర్పా ట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ తెలిపారు.