చిన్నశంకరంపేటలో ముస్తాబైన సోమేశ్వరస్వామి ఆలయం
చిన్నశంకరంపేట, ఫిబ్రవరి 27 : మహాశివరాత్రి పురస్కరించుకొని చిన్నశంకరంపేటలోని సోమేశ్వర ఆలయాన్ని 51వ వార్షికోత్సవాలకు సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఆలయ వార్షికోత్సవాలు మార్చి 1 నుంచి 4వ తేదీ వరకు కొనసాగుతాయని సర్పంచ్ రాజిరెడ్డి తెలిపారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 1న గణపతి హోమం, రుద్రహోమం, మహానాగుల పూజ, అభిషేకం, సోమేశ్వరస్వామి, మల్లికార్జున స్వామి పల్లకీ సేవ. మార్చి 2న గణపతి హోమం, రుద్రహోమం, బండ్ల ఊరేగింపు. మార్చి 3న కుంకుమార్చన, పోచమ్మ అమ్మవారికి బోనాలు, భైరవపూజ, అగ్ని గుండాలు తొక్కుట, మార్చి 4న సోమేశ్వరస్వామి కల్యాణం, రావణ దహనం, రథోత్సవం నిర్వహిస్తున్నారు. ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని సర్పంచ్ రాజిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
ఉత్సవాలకు ముస్తాబైన శివాలయాలు…
చేగుంట, ఫిబ్రవరి 27 : మండలంలో శివాలయాలు జాతర కు ముస్తాబవుతున్నాయి. రాంపూర్‌లోని సంతాన సోమేశ్వర ఆలయంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ కాశబోయిన భాస్కర్, ఆలయ కమిటీ సభ్యులు సాయికుమార్, కాశబోయిన సుదర్శన్, సత్తయ్య, చంద్రం తెలిపారు.
వల్లాభాపూర్లోని108 శివలింగోద్భవ భవాని శ్రీరామంలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా, శివపార్వతుల కల్యాణం నిర్వహించనున్నారు. ఉల్లితిమ్మాయిపల్లిలోని రాజరాజేశ్వర ఆయలంలో ఉత్సవాలు జరుగనున్నాయి.
ఘనంగా శివపార్వతుల కల్యాణ ఉత్సవాలు
పాపన్నపేట, ఫిబ్రవరి 27 : మండల కేంద్రలో శివపార్వతు ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పురోహితులు విశ్వనాథశర్మ నేతృత్వంలో పరమశివుడికి అభిషేకాలు, పూజలు చేశారు. ఉత్సవాల్లో సర్పంచ్ గురుమూర్తిగౌడ్, నేతలు రవీందర్‌గౌడ్, కిషన్‌రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
శ్రీ మల్లికార్జున ఆలయంలోప్రత్యేక పూజలు
మెదక్ రూరల్, ఫిబ్రవరి 27 : మంబోజిపల్లిలోని కోయ్య గుట్టపై కొలువుదీరిన శ్రీమల్లికార్జునస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. మహిళలురేగు చెట్టుకు ముడుపులు కట్టి, పట్నాలు వేసి, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.