రూ. 49 కోట్లతో రోడ్డు నిర్మాణం పూర్తి
ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్
బ్రిడ్జి పనులు పూర్తికావడంతో రాకపోకలు షురూ
త్వరలోనే అధికారికంగా ప్రారంభం
అమీన్పూర్, ఫిబ్రవరి 27: ఎన్నో ఏండ్ల నాటి కల టీఆర్ఎస్ సర్కారు నెరవేర్చింది. రోడ్డుపై రద్దీతో ఇబ్బందులు పడ్డ ప్రజల సమస్యకు ఇక చెక్ పడ్డట్లే. పారిశ్రామికవాడ ప్రాంతం కావడంతో అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ-కిష్టారెడ్డిపేట రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉండేది. స్థానిక ప్రజలు ఈ రహదారిపై ప్రయాణించాలంటేనే నరకం కనిపించేది. గతంలో ఇక్కడి ప్రజలు ప్రజాప్రతినిధులకు ఎన్నో విన్నపాలు చేశారు. ధర్నాలు, రాస్తారోకోలు ఎన్ని చేపట్టినా అప్పటి పాలకులు పట్టనట్లుగా వ్యవహరించేవారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ రోడ్ల నిర్మాణాలపై దృష్టి సారించడంతో అమీన్పూర్ రహదారికి మోక్షం లభిందింది. బీరంగూడ-కిష్టారెడ్డిపేట రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని అధికారిక ప్రారంభానికి సిద్ధంగా ఉన్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సీఎం కేసీఆర్ పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, అమీన్పూర్ టీఆర్ఎస్ నాయకుల కోరిక మేరకు బీరంగూడ రహదారి నిర్మాణంపై హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.49 కోట్ల నిధులను మంజూరు చేశారు. రహదారి పూర్తి చేసిన అధికారులు చివరిగా బీరంగూడ వద్ద టెక్నికల్ సమస్యలతో బ్రిడ్జి నిర్మాణం కొంత ఆలస్యమైనా పూర్తి చేశారు. ప్రస్తుతం మహాశివరాత్రి సందర్భంగా బీరంగూడ బ్రమరాంభికామల్లికార్జున స్వామి జాతరకు రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అధికారికంగా ఈ రహదారిని ప్రారంభించేందుకు మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు.
హామీ మేరకు పూర్తి..
గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. రహదారి నిర్మాణానికి రూ.49 కోట్లు మంజూరు చేయడంతో పనులు పూర్తి చేశాం. బీరంగూడలో నిర్వహించే మహా శివరాత్రి జాతరకు అందుబాటులోకి తీసుకువచ్చాం. త్వరలోనే సెంటర్ లైటింగ్‌ను ఏర్పాటు చేసి అధికారికంగా ప్రారంభిస్తాం.
– ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
ఏండ్ల నాటి కల నెరవేరింది..
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి నిర్మాణం ఇక్కడి ప్రజల ఏండ్ల కల నెరవేరింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చొరువతో ఈ రహదారి నిర్మాణం పూర్తి చేశాం. చాలా సంతోషంగా ఉన్నారు. అమీన్పూర్ మున్సిపల్లో మరిన్ని పెద్ద రహదారులు అవసరమున్నది. వాటిని సైతం పూర్తి చేస్తాం.
– మున్సిపల్ చైర్మన్ తుమ్ము పాండురంగారెడ్డి