ప్రజావాణిల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సంగారెడ్డి కలెక్టరేట్లో కలెక్టర్ శరత్, మెదక్‌లో అదనపు కలెక్టర్ రమేశ్ సమస్యలు తెలిపేందుకు వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిర్యాదులను జాప్యం లేకుండా సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, ఒకసారి ఇక్కడికి వచ్చిన వారు మళ్లీ రాకుండా చూడాలని ఆదేశించారు. భూ సమస్యలకు సంబంధించి అధికంగా దరఖాస్తులు వస్తున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 19: ప్రజావాణికి అర్జీదారుల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతివారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా సంగారెడ్డి జిల్లా నలుమూల నుంచి అర్జీదారులు కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ఆయా సమస్యలను అధికారులకు తెలియజేస్తూ వాటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అర్జీదారుల నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కలెక్టర్ డాక్టర్ శరత్ వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయా అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు జారీ చేస్తూ, వాటిని సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిలా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
మెదక్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిషరించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్లోని ప్రజావాణి హాల్లో జిల్లా నలుమూల నుంచి వచ్చిన 62 విజ్ఞప్తులను ఆయన స్వీకరించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కావాలని 10, ఆసరా పింఛన్లకు 8, భూ సమస్యలు తదితర వాటికి 44 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వివిధ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులను ఆయా శాఖల అధికారులకు అందజేస్తూ దరఖాస్తులను సాధ్యమైనంత తొందరగా పరిషరించాలని సూచించారు.
భూ సమస్యలకు సంబంధించి ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నందున, వాటికి ప్రాధాన్యతనిచ్చి పరిషరించాలని, మెదక్, నర్సాపూర్ ఆర్డీవోలతో సమన్వయం చేసుకోవాలని కలెక్టరేట్ ఏవోకు సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శైలేశ్, డీఎస్వో శ్రీనివాస్, ఆర్డీవో సాయిరాం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మెదక్ అర్బన్, సెప్టెంబర్19: అర్జీదారుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని మెదక్ జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో ప్రజావాణి నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదులు స్వీకరించారు. శివ్వంపేట మండలం గూడుర్ గ్రామానికి చెందిన పాతుర్ యాదయ్య, తమ తాత పాతర మల్లయ్యకు సంతానం లేనందున ఆయన మృతి చెందినప్పుడు తాను దహన సంస్కారాలు చేశానని, ఆ సమయంలో ఆయన అన్న కుమారులు నర్సయ్య , భూమయ్య , వెంకటయ్య, తమ తాత పేరు మీద ఉన్న భూమి సర్వేనెం.448లో 30 గుంటలు ,458/4లో 30 గుంటలు తన పేరున పట్టా చేసి ఇసానని 1982లో రాయించి ఇచ్చారన్నారు.
ఆ భూమిని తనకు తెలియకుండా పట్టా చేయించుకున్నారని, ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నారని, తనకు న్యాయం చేయాలని యాదయ్య ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం ఫిర్యాదికి న్యాయం చేయాలని జిల్లా అదనపు ఎస్పీ శివ్వంపేట ఎస్సైకి సూచించించారు. మెదక్ పట్టణానికి చెందిన కిరణ్‌కుమార్ తనకు పటేల్ టింబర్ డిపో ఉందని, తమ షాప్‌లో మియాపూర్‌కు చెందిన రవికిరణ్ ఉడెన్ పాయ్లెట్ కోసం మెటీరియల్‌ను రూ.6,40,000కు అగ్రిమెంట్ చేసుకుని, తీసుకెళ్లారని, దానికి సంబంధించిన డబ్బులు అడిగితే ఇవ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. అదనపు ఎస్పీ స్పందిస్తూ చట్ట ప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయాలని మెదక్ పట్టణ సీఐ సూచించారు.