పటాన్చెరు, సెప్టెంబర్ 15 : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం హైదరాబాద్ క్యాంపస్‌లో ఇంజినీర్స్ డే ను ఘనంగా జరుపుకొన్నారు. రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో భారతరత్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థులు రక్తదానం చేసి విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమానికి బీహెచ్ఈఎల్ డిప్యూటీ మేనేజర్, ఫోరం టు ఇంప్రూవ్ థింగ్స్ (ఎఫ్ఐటీ) ప్రధాన కార్యదర్శి భగత్‌సింగ్ ముఖ్య అతిథిగా హాజరై విశ్వేశ్వరయ్య సేవలను కొనియాడారు. ప్రతి విద్యార్థిలో ప్రతిభ ఉంటుందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయాలు చేకూరుతాయన్నారు. గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎన్ రావు మాట్లాడుతూ గీతం విద్యార్థులు విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కోరారు. నూతనంగా స్మార్ట్ క్లబ్‌ను గీతంలో ప్రారంభించారు.
ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈఈసీఈ) విభాగంలో జీ – ఎలక్ట్రా పేరుతో ఏర్పాటు చేసిన స్మార్ట్ సిస్టమ్స్ క్లబ్‌ను ప్రొఫెసర్ డీఎన్ రావు ప్రారంభించారు. ఈ క్లబ్ విద్యార్థులు ప్రదర్శించిన రెస్క్యూ రోబోట్, బ్లెండెన్ విజన్, స్మార్ట్ పార్కింగ్, మూగ-చెవిటి వారికి ఉపకరించే సహాయ్-యంత్రిన్, ఫ్యాన్ బల్బులను రిమోట్ కంట్రోల్‌తో నియంత్రించే టెలిగ్రామ్ కంట్రోల్డ్ రూం వంటి పలు మోడళ్లను ఆయన సందర్శించారు.ఆటోమేషన్ ద్వారా ప్రజా జీవనం మరింత సుఖవంతమవుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు రక్తదాన శిబిరం నిర్వహించారు. చరవైతి, భారత రెడ్‌క్రాస్ సొసైటీతో కలిసి 300 యూనిట్ల రకాన్ని సేకరించారు. కార్యక్రమంలో గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సీతారామ య్య, ప్రొఫెసర్ మంజునాథాచారి, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.