సంగారెడ్డి, సెప్టెంబర్ 15(నమస్తే తెలంగాణ) : తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను సంగారెడ్డి జిల్లాలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్‌తో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డితో పాటు పటాన్చెరు, నారాయణఖేడ్, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు. ర్యాలీలో యువత, విద్యార్థులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజ లు పాల్గొననున్నారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో నాలుగు ర్యాలీలు తీయనున్నారు. పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం నుంచి అంబేద్కర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అదే సమయంలో పట్టణంలోని నాలుగు వేర్వేరు ప్రాంతాల నుంచి ర్యాలీలు ప్రారంభమై అంబేద్కర్ స్టేడియం చేరుకుంటాయి. ర్యాలీలు ముగిసిన అనంతరం అంబేద్కర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. సభలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి పాల్గొంటారు.
సంగారెడ్డితో పాటు నారాయణఖేడ్, అందోలు, పటాన్చెరు, జహీరాబాద్‌లో శుక్రవారం జాతీయ సమైక్యతా వజ్రోత్సవ ర్యాలీలు, సభలు జరగనున్నాయి. సంగారెడ్డితో పాటు మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ర్యాలీలు, సభల నిర్వాహణ ఏర్పాట్లను కలెక్టర్ శరత్, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి పరిశీలించారు. సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ నిర్వహణ ఏర్పాట్లను సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతాప్రభాకర్ పరిశీలించారు. 17వ తేదీన ఉదయం 9 గంటలకు సంగారెడ్డిలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తారు.
ఈ వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి ఆ తర్వాత ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేస్తారు. అదే రోజు సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో బంజారా భవన్, సేవాలాల్ భవన్‌ను ప్రారంభించనున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో గిరిజనులు, గిరిజన ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తరలివెళ్లనున్నారు. 18వ తేదీన సంగారెడ్డిలోని సమీకృత కలెక్టరేట్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. వజ్రోత్సవ వేడుకల్లో అన్ని వర్గాలు పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ శరత్ కోరారు.