మెదక్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): అక్కన్నపేట-మెదక్‌కు 17 కిలోమీటర్ల రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయని, మరో వారం, పది రోజుల్లో కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్‌కు ప్యాసింజర్ రైళ్లు నడుపుతామని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. బుధవారం అక్కన్నపేట స్టేషన్ నుంచి లక్ష్మాపూర్, గంగాపూర్ మీదుగా మెదక్ రైల్వే స్టేషన్‌కు స్పెషల్ ట్రైన్లో వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్కన్నపేట, మెదక్ రైల్వే పనులు పూర్తయ్యాయని, త్వరలో ప్యాసింజర్ రైళ్లు నడుపతామని పేర్కొన్నారు. కాచిగూడ నుంచి వయా అక్కన్నపేట మీదుగా మెదక్‌కు రెండు ప్యాసింజర్ రైళ్లను నడుపుతామన్నారు. ఉదయం ఒక ప్యాసింజర్, సాయంత్రం ఒక ప్యాసింజర్‌ను నడుపుతామని పేర్కొన్నారు.
మెదక్ రైల్వేస్టేషన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, చిన్నచిన్న పనులు ఉంటే వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. అంతేకాకుండా ప్రజాఅవసరాలకు అనువుగా మెదక్ నుంచి వయా అక్కన్నపేట మీదుగా తిరుపతి వరకు రైలును నడిపే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైల్వేశాఖ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
అక్కన్నపేట నుంచి నేరుగా మెదక్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్‌కుమార్ జైన్‌కు మెదక్ రైల్వే స్టేషన్ అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ రైల్వేస్టేషన్లో జీఎం కలియ తిరిగారు. ముందుగా రైల్వేస్టేషన్‌లోని అన్ని గదులతో పాటు బాత్రూంలను పరిశీలించారు. రైల్వేస్టేషన్ నుంచి కొద్ది దూరం నడిచి రైల్వే ట్రాక్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు.
అనంతరం బుకింగ్ కౌంటర్లోకి వెళ్లి ఇన్చార్జి స్టేషన్ మాస్టర్‌తో మాట్లాడారు. మెదక్ రైల్వే స్టేషన్లో ఎలాంటి పనులు పెండింగ్‌లో ఉండొద్దని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 15 ఏండ్ల క్రితం మెదక్ తహసీల్దార్ కార్యాలయం పక్కన దక్షిణ మధ్యరైల్వే రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ ఉండేదని, ఇప్పుడు మెదక్‌లో రైల్వేస్టేషన్ ఏర్పాటైంది కాబట్టి రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరగా, జీఎం స్పందిస్తూ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు.
ఆయన వెంట చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ నీరజ్ అగర్వాల్, హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ శరత్ చంద్రయాన్, చీఫ్ ఇంజినీర్ రవికాల్బండే, జీఎం సెక్రటరీ శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్, సుమిత్మిట్టల్, మోతీలాల్బుక్యా, రాజ్‌కుమార్, వెంకన్న, కిరణ్‌కుమార్, నీల పావని, ఛటోపాధ్యా య, జీషాన్ అహ్మద్ తదితరులున్నారు.
రామాయంపేట, సెప్టెంబర్ 14: రామాయంపేట మండలం అక్కన్నపేట నుంచి లక్ష్మాపూర్ గ్రామాల్లోని నూతనంగా నిర్మాణం చేపట్టిన రైల్వే స్టేషన్లను దక్షిణ మధ్యరైల్వే ఇన్చార్జి జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్గమధ్యంలో రైల్వే స్టేషన్లలో పనులను పూర్తి చేసి ఈ మధ్యలోనే రైళ్లను ప్రారంభిస్తామన్నారు. చిన్న చిన్న పనులు నడుస్తున్నాయని వాటిని కూడా తొందర్లోనే పూర్తి చేస్తామన్నారు.
మొన్నటి వర్షాలకు దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులను పూర్తి చేశామన్నారు. అక్కన్నపేటలో టీఆర్ఎస్ నాయకుడు మాజీ సర్పంచ్ జంగం సిద్ధిరాములు అక్కన్నపేట రైల్వేస్టేషన్లో అజంతా ఎక్స్‌ప్రెస్ నిలుపాలని ఎక్స్‌ప్రెస్ నిలుపకపోవడం వల్ల ఈ ప్రాం త రైతులకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని జీఎంకు వివరించి, వినతి పత్రం సమర్పించారు. అక్కన్నపేటలోని పరిసరాలను పరిశీలించి రైల్వేస్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. అక్కడే ఉన్న ప్రయాణికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనవెంట అక్కన్నపేట రైల్వే అధికారులు ఉన్నారు.