తూప్రాన్, నవంబర్ 11 : టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల కష్టాలు ఒక్కొక్కటిగా తీరుతున్నాయి. వ్యవసాయం శుద్ధ దండుగ అన్నవారే, నేడు తెలంగాణ రైతాంగం సాధించిన పురోగతిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. రైతుబంధుతో పెట్టుబడి సాయం, సబ్సిడీ ధరలకు విత్తనాలు, ఎరువులు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, కాళేశ్వరం లాంటి భారీ నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కాల్వల ద్వారా గోదావరి జలాలు రావడంతో నాడు నెర్రలు చాచి నోరు తెరిచిన బీడుభూములు నేడు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతున్నాయి. రైతుల శ్రమను దోచుకునే దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు, కనీస మద్దతు ధర ప్రకటించి, కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నది.
దీంతో ఇటు తెలంగాణ వ్యాప్తంగా రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు, అటు ఎరువులు, విత్తనాలు నిల్వ చేసేందుకు వీలుగా గోదాంల నిర్మాణాన్ని చేపట్టారు. తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని అల్లాపూర్ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారి సమీపంలో గోదాంల నిర్మాణం తుది దశకు చేరుకున్నది.
త్వరలో ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటున్నది. రైతు లు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులు నిర్మించాలని రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, గోదాంల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేర్ హౌజ్ కార్పొరేషన్ ద్వారా రూ. 16. 25 కోట్ల వ్యయంతో, పదెకరాల విస్తీర్ణంలో, 20వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నాలుగు గోదాంలను నిర్మిస్తున్నారు. 18 నెలల కాలపరిమితితో 2021 ఆగస్టులో ప్రారంభించిన గోదాంల నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చేనెలాఖరులోగా అందుబాటులోకి రానున్నాయి. దీం తో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.