రామచంద్రాపురం/పటాన్చెరు, నవంబర్17: కేంద్రం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై జిల్లాలోని బీహెచ్ఈఎల్, బీడీఎల్, ఓడీఎఫ్ కంపెనీల్లోని బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో మహాధర్నా చేశారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆల్ ఇండియా బీఎంఎస్ పిలుపు మేరకు పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ నేషనల్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. కార్యక్రమానికి దేశ వ్యాప్తం గా దాదాపు లక్ష మంది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలోని బీడీఎల్, బీహెచ్ఈఎల్, ఓడీఎఫ్ కంపెనీల కార్మికులు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఎంఎస్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మల్లేశం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అత్యధికంగా పెట్టుబడుల ఉపసంహరణ, కార్పొరేటీకరణ, స్ట్రాటిజిక్ సేల్ అంటూ ప్రభుత్వ రంగ సంస్థలను కనుమరుగు చేసేందుకు కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. దీనికి బీఎంఎస్ ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించదని హెచ్చరించారు. ఈ మహాధర్నా కేంద్ర ప్రభుత్వ కార్మిక విధానాలు, పారిశ్రామికవిధానాలపై ఒక హెచ్చరిక అన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వరంగ సంస్థల్లో ఎఫ్‌డీఐలను అనుమతించవద్దని ప్రధాన డిమాండ్ పెడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తూ కార్మికుల హక్కులను కాపాడుతున్నామన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు నామరూపాలు లేకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలు చేస్తాయని గుర్తించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడేందుకు బీఎంఎస్ ఎప్పుడూ పోరాడుతుందన్నారు. కార్యక్రమంలో బీహెచ్ఈఎల్ కార్మిక సంఘం అధ్యక్షుడు మహేశ్, ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ అశోక్పూడీ, వర్కింగ్ ప్రెసిడెంట్స్ జనార్దన్, కిష్టయ్య, ఉపాధ్యక్షులు చంద్రమోహన్, చౌడేశ్, ఆఫీస్ సెక్రటరీ విజయ్, ఓడీఎల్, బీడీఎల్ సంఘాల నేతలు, కార్మికులు పాల్గొన్నారు.