సంగారెడ్డి /మెదక్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : మెదక్, సంగారెడ్డిజిల్లాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరిగింది. రెండ్రోజుల కిందట రాత్రివేళల్లోనే చలి ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ఉదయం కూడా ప్రభావం చూపుతున్నది. రాత్రి 9 నుంచి ఉదయం 8 గంటల వరకు బయటికి రావాలంటే ప్రజలు గజగజ వణికిపోతున్నారు. తెల్లవారుజాము నుంచి రోడ్లను మంచు కప్పివేస్తున్నది. చలి తీవ్రతను తట్టుకునేందుకు స్వెటర్లు, మంకీ క్యాప్‌లను కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనున్నదని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో వృద్ధు లు, చిన్నారులు, ముఖ్యంగా శ్వాసకోశ బాధితులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలి పంజా విసురుతుండడంతో ఉదయం వేళలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మెదక్‌లో..
ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. వారం క్రితం 13.5 డిగ్రీల సెల్సియస్‌కు పైగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 10.5 డిగ్రీలలోపు చేరాయి. మెదక్ జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడంతో చలి విజృంభిస్తోంది. గత ఏడాది 15 డిగ్రీలలోపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్, నర్సాపూర్, తూప్రా న్, చేగుంట, రామాయంపేట పట్టణాలతో పాటు ఆయా మండల కేంద్రాల్లో స్వెటర్ల దుకాణాలు భారీగా వెలిశాయి.
సంగారెడ్డిలో ..
సంగారెడ్డిజిల్లాలో చలి పంజా విసురుతున్నది. జహీరాబాద్ మండలంలోని సత్వార్‌లో గురువారం అత్యల్పంగా 9.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలో 9.4 డిగ్రీలు, మొగుడంపల్లిలో 9.5 డిగ్రీలు, న్యాల్కల్లో 9.6 డిగ్రీలు, జహీరాబాద్ మండలం మల్చెల్మలో 9.7 డిగ్రీలు, అందోలు మండలం అల్మాయిపేటలో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కోహీర్ మండలం దిగ్వాల్లో 10.5 డిగ్రీలు, కంది గ్రామంలో 10.6 డిగ్రీలు, సిర్గాపూర్, నాగల్గిద్ద మండలం ముక్తాపూర్‌లో 10.7 డిగ్రీలు, పుల్కల్లో 10.8 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. పటాన్చెరు, జిన్నారం, చౌటకూరు, హత్నూర, జిన్నారం మండలాల్లో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కంగ్టి, నారాయణఖేడ్, రాయికోడ్, మ నూరు, అమీన్పూర్, కొండాపూర్ మండలాల్లో 12 నుంచి 13 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదైంది. ఉదయం, సాయంత్రం వేళల్లో చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు.