ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా కోరారు. బుధవారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టిసారించాలని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలందరూ ఓటేసి పోలింగ్ శాతం పెరిగేందుకు మీడియా కృషిచేయాలని కోరారు.
మెదక్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): శాసనసభ ఎన్నికలను పారదర్శకంగా, నిపక్షపాతంగా నిర్వహించేందుకు మీడియా సహకరించాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (ఎంసీఎంసీ)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియ దర్శిని, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లతో పరిశీలించారు. మీడియా సెంటర్లో ఉన్న సదుపాయాలను ఎంసీఎంసీ పనితీరుకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నాట్లు తెలిపారు. ఎంసీఎంసీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటనలను ప్రసారం చేయడం, సంబంధిత అభ్యర్థి ప్రచార వ్యయంలో వాటిని లెకించడం, సోషల్ మీడియాలో అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రకటనలకు వంటివి సకాలంలో ఆమోదిస్తూ, మంజూరు చేయాలని సూచించారు. శాటిలైట్ చానెల్స్‌లో వచ్చే వార్తలను పూర్తిస్థాయిలో రికార్డు చేయాలన్నారు.
వార్తా పత్రికలు, ఈ-పేపర్లు, టెలివిజన్ చానెళ్లు, స్థానిక కేబుల్ నెట్ వర్కు, సోషల్ మీడియా, మూవీ హౌస్‌లు, సంక్షిప్త సందేశాలు, ఇతర ఆడియో-వీడియో విజువల్ మీడియాలతో సహ ప్రకటనలను ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి పొందిన తర్వాతే విడుదల చేయాలని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించదానికి మీడియా పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ కోరారు.
వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి
పోలింగ్ కేంద్రాల్లో వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్లోని వీడియో సమావేశ మందిరంలో నోడల్ అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మరమ్మతులు, మిగిలిన పనులను ఈ నెల 30వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఊరు- మనబడి పనులు పూర్తి చేయాలని, పంచాయతీ సమన్వయంతో పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీరు, విద్యుత్, టాయిలెట్స్, షామియానాలు కల్పించాలన్నారు. దివ్యాంగుల కోసం ర్యాంప్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అధికారులంతా జాయింట్ టీమ్‌గా పని చేయాలని, పోస్టల్ బ్యాలెట్ నిర్వహణ, బ్యాలెట్ పేపర్ తయారీ, ప్రతి పోలింగ్స్టేషన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని, బూత్ లెవల్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. స్వీప్ కార్యక్రమంలో అన్ని శాఖల సమన్వయంతో పాల్గొని ఓటింగ్ శాతం పెంచాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
ఆయుధాల లైసెన్సులు కలిగిన వారి వివరాల సేకరణ
మెదక్ అర్బన్,అక్టోబర్18:రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఆయుధాల చట్టం 1959లోని సెక్షన్ 21 ప్రకారం లైసెన్సింగ్ అథారిటీ ద్వారా అనుమతులు పొందిన ఆయుధాల లైసెన్సు కల్గి ఉన్న వివరాలు సేకరించామని కలెక్టర్ తెలిపారు. ప్రజా శాంతి, ప్రశాంతతను కాపాడేందుకు మెదక్ జిల్లా పరిధిలో నివసిస్తున్న ఆయుధాల లైసెన్సులు కలిగిన వారి అందరి వివరాల సేకరణ చేశారు. లైసెన్స్ దారులు పోలీసుల ఆదేశాలు పాటిండంలో విఫలమైతే చట్టంలోని తగిన నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని వారు పేర్కొన్నారు.
అధికారులు జాయింట్ టీమ్‌గా పనిచేయాలని, ఫీల్డ్ టీమ్గ్ ఏర్పడాలని, నేర సంబంధ కల్గిన వారి వివరాలు సేకరించాలని, ఉచిత మద్యపానం సరఫరా అయిందా అనే వివరాలు సేకరించాలన్నారు. వివిధ వాహనాల్లో రకరకాల వస్తువుల రవాణాపై నిఘా పెట్టాలని, పోస్టాఫీసులో ఒకే సారి వివిధ రకాల అర్డర్స్పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. బ్యాంకుల్లో ఒకేసారిగా 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే, వారి వివరాలు సేకరించాలని, అలాగే రూ.10లక్షల కంటే పైన డిపాజిట్ అయితే వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. కార్యక్రమంలో మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సీటీఓ మహేందర్‌రెడ్డి, ఆర్టీవో రిచర్డ్ ఏ ముత్తు, ఆడిషనల్ ఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.