బావులకాడ అమ్మలక్కలంతా బిందెలెత్తుకు వచ్చిన రోజులు గతం.. బోరు మోటర్ల నీళ్లు రాక రైతన్నలు ఆకాశం వంక దీనంగా చూసిన రోజులు ఆనాటివి. ఇప్పుడు ఎర్రటెండల్లోనూ చెరువులు, కుంటలు మత్తళ్లు పోస్తుంటే రైతుల కండ్లల్లో ఆనందం కనబడుతున్నది.
నేను రానుబిడ్డో సర్కారు దవాఖాకు అంటూ పాటలు పాడుకున్న రోజుల నుంచి
సర్కారు దవాఖానకే పోదాంపద బిడ్డా.. అన్న రోజులు వచ్చినయ్..
పల్లెలనిడిసి బతుకు దెరువుకు పోయిన మెతుకుసీమ జనం ఇప్పుడు పల్లెల్లోనే పని
చేసుకుంటున్నరు.. పక్క రాష్ట్రపోళ్లకు పని కల్పిస్తున్నరు.
గ్రామాలన్నీ అంధవికారంగా కనిపిస్తూ, రోగాలకు ఆవాసాలుగా ఉన్న రోజుల నుంచి ఆరోగ్యం అంటే గ్రామాల్లోనే అనే విధంగా మారాయి..
నిధుల్లేక నీరసించిన పల్లెలు, పట్టణాలు ఆనాడు.. ఇప్పుడు నలువైపులా అభివృద్ధి.. ఇదంతా ఎనిమిదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ సాగించిన ప్రగతిబాట.
తెలంగాణ సాధించిన నేత.. రాష్ర్టానికి సారథి కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. ఎనిమిదేండ్ల కాలంలో అద్భుతాలు సృష్టించింది. పాలకుల్లో సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఉంటాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ, గౌరవెల్లి, తపాస్‌పల్లి, తోటపల్లి, సింగూరు, హల్దీవాగులతో ఉమ్మడి మెదక్ సస్యశ్యామలంగా మారింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాను అగ్రగామిగా నిలుపుతున్నారు. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. యాభై ఏండ్లలో జరగని ఎన్నో పనులు టీఆర్ఎస్ పాలనలో జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనదక్షత ఫలితంగా ఎనిమిదేండ్లలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో ముందు వరుసలో నిలిచింది.
సిద్దిపేట, జూన్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎనిమిదేండ్ల కాలంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో అభివృద్ధి పరవళ్లు తొక్కింది. పాలకుల సంకల్పం ఉంటే అద్భుతాలు ఎలా ఆవిష్కృతం అవుతాయో కాళేశ్వరం ప్రాజెక్టు పనులే నిదర్శనం. మిషన్ కాకతీయతో చెరువులకు పూర్వవైభవం వచ్చింది. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి జలాలు అందించి గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని టీఆర్ఎస్ సర్కారు తీర్చింది. రోడ్లకు మహర్దశ వచ్చింది. సమీకృత మార్కెట్లు, మోడల్ రైతుబజార్లు రాష్ర్టానికి ఆదర్శంగా నిలిచాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ఉమ్మడి మెదక్ జిల్లాను అగ్రగామిగా నిలుపుతున్నారు.
రైతులకు నాణ్యమైన కరెంటు సరఫరా జరుగుతున్నది. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు, ఆర్కిటెక్చర్ల పర్యవేక్షణలో లేఔట్స్‌తో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టారు. ప్రజల వద్దకు పాలనను అందించాలనే సంకల్పంతో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, జిల్లాలు ఏర్పాటు చేశారు. తద్వారా పాలనను ప్రజలకు చేరువ చేశారు. అక్కన్నపేట-మెదక్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేనిర్మాణ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలను పెంచడంతో ఇవాళ గ్రామాలు పచ్చని వాతావరణంతో కనిపిస్తున్నాయి. పల్లెప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో పల్లెలు, పట్టణాలు ఆరోగ్య గ్రామాలుగా మారాయి.
గజ్వేల్‌లోని ఎడ్యుకేషన్ హబ్, ములుగులోని హార్టికల్చర్ యూనివర్సిటీ తదితర పనులు ఎన్నో జరిగాయి. కలెక్టరేట్, పోలీసు కమిషనరేట్ కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభమయ్యాయి. మెదక్ జిల్లాలో అతి త్వరలోనే ప్రారంభం కానున్నది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పునరావాస కాలనీలు నిర్మాణమయ్యాయి. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు. దీంతో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది.
ఇటీవల కాలంలో మోకాళ్ల చికిత్సను సైతం ప్రభుత్వ దవాఖానల్లో చేస్తున్నారు. ప్రతి దవాఖానలో ప్రసవాల సంఖ్యను పెంచేలా గ్రామాల్లో ఆశ వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. యాభై ఏండ్లలో జరగని ఎన్నో అభివృద్ధి పనులు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగాయి. నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని సిద్దిపేటలో ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ జిల్లాలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సంగారెడ్డిలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ జాతీయ జెండాలను ఆవిష్కరిస్తారు.
సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి, నదిలేని చోట రిజర్వాయర్‌ను నిర్మించి, నదికే నడక నేర్పారు. సిద్దిపేట జిల్లా నలువైపులా రిజర్వాయర్లు, కాల్వలు నిర్మాణంతో రిజర్వాయర్ల ఖిల్లాగా జిల్లా మారింది. అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లకు గోదావరి జలాలు రావడంతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ ప్రాజెక్టులతో మెతుకు సీమకు పూర్వవైభవం వచ్చింది. సమైక్య రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు నిర్మాణం సైతం నోచుకోని ఉమ్మడి మెదక్ జిల్లాకు.. స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లాను సస్యశ్యామలం చేసే గోదావరి జలాలు రాజరాజేశ్వర రిజర్వాయర్ (మిడ్‌మానేరు) నుంచి సిద్దిపేట జిల్లాకు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ జిల్లాలు కలుపుకొని మొత్తం 8,45,656 ఎకరాలు, సింగూరు ప్రాజెక్టు కింద 40 వేల ఎకరాలకు సారునీరు అందనున్నది.
బీడు భూముల్లో గోదావరి జలాలు పారించి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం నెరవేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రిజర్వాయర్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని చెరువులను గోదావరి జలాలతో నింపుకొంటున్నాం. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌ను ఫిబ్రవరిలో సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారు. గోదావరి జలాలతో కొమురవెల్లి మల్లన్న పాదాలను అభిషేకం చేశారు. ప్రధాన కాల్వల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.
భూసేకరణ తదితర పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ పథకం ద్వారా సంగారెడ్డి, అందోల్, నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో దాదాపుగా 3.90లక్షల ఎకరాలకు సాగు నీరందుతున్నది. ఈ ఎత్తిపోతల పథకాలతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని సంగారెడ్డి, మెదక్ జిల్లాలోని ప్యాకేజీ పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రిజర్వాయర్లు అన్ని పర్యాటకులు సందిర్శించేలా తీర్చిదిద్దనున్నారు.
ఇందుకోసం ఈసారి రాష్ట్ర బడ్జెట్లో టూరిజం అభివృద్ధికి రూ.1500 కోట్లు కేటాయించారు. గోదావరి జలాలతో చెరువులు,కుంటలు, చెక్‌డ్యాంలు నింపారు. మండుటెండల్లో మత్తళ్లు దుంకాయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉమ్మడి మెదక్ జిల్లా సాగునీటి కష్టాలు తీరాయి. మెదక్ జిల్లా వనదుర్గా ఘనపూర్ ప్రాజెక్టును రూ.100 కోట్లతో ఆధునీకరిస్తున్నారు. దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు మరో రూ.100కోట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది.

రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏటా రెండు పంటలకు గానూ ఎకరాకు రూ.10 వేలను అందిస్తున్నది. రైతుబంధు పథకం ప్రారంభం నుంచి వరుసగా ఎనిమిదో పంటకు సీఎం కేసీఆర్ అందించారు. రైతుబంధు ప్రారంభం నుంచి ఇప్ప టి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 59,84,281 మంది రైతులకు రూ. 6,154.25 కోట్లు నేరుగా రైతుల ఖాతాలో జమచేసింది.

రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టింది.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ పథకం కింద 1097పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో సిద్దిపేట జిల్లాలో 343, మెదక్ జిల్లాలో 313, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలు ఎంపిక చేయగా, పనులు జోరుగా జరుగుతున్నాయి.
ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. తొలి విడతలోనే జిల్లా ఏర్పాటు కాగానే సిద్దిపేట జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటైంది. భవన నిర్మాణాన్ని సైతం పూర్తి చేసుకొని సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఇక్కడ బోధన విజయవంతంగా కొనసాగుతున్నది. సంగారెడ్డికి మెడికల్ కళాశాల మంజూరు కాగా, పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో మెదక్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు కానున్నది. ఇందుకు బడ్జెట్లో నిధులను ప్రభుత్వం ప్రతిపాదించింది.

రైతు ఏ కారణంతోనైనా మరిణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షలను రైతుబీమా పథకం ద్వారా అందిస్తున్నది. రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విడతల వారీగా అర్హులైన ప్రతి రైతుకు రూ.లక్ష రుణమాఫీని చేస్తున్నది. ఇప్పటి వరకు రూ. 50 వేల వరకు మాఫీ చేయగా, తాజా గా మొన్నటి బడ్జెట్లో రూ.75 వేలకు మాఫీ చేస్తామని బడ్జెట్ నిధులు కేటాయించారు.

‘సిద్దిపేట జిల్లా కావాలనుకున్నాం.. ఈ రోజు చేసుకున్నాం.. పట్టుబడితే సిద్దిపేట అన్నీ సిద్ధించే వరకు పోరాడే పేట తప్పా.. పిడికిలి దించదు.. ఈ గడ్డమీది నుంచి ఏ సంకల్పం చేసినా.. ఏ పని చేసినా విజయం దిగ్విజయమై ముందుకు సాగుతా ఉన్నాం.. ఈ గడ్డ మీద పుట్టి మీ కళ్లల్లో, మీ చేతుల్లో ఎదిగి.. ఇంత ఎత్తుకు ఎదిగి స్వరాష్ర్టాన్ని సాధించి ఈ రోజు జిల్లా ప్రారంభించుకునేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు ఇచ్చాడు.. ఇది చాలా తక్కువ మందికి దొరికే అవకాశం.. నాకళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయి.. ఒక అద్భుతమైనటువంటి ఘట్టం.. అని సీఎం కేసీఆర్ ఉద్వేగానికి లోనయ్యారు. ‘మీ బిడ్డగా నాకు జీవితంలో ఇంతకన్నా కావాల్సింది ఏం లేదు’.. అని అన్నారు.
2015 జూలై 4న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ రెండోసారి పర్యటించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ‘సిద్దిపేట నర్సరీలో పుట్టిన మొక్క ఇవాళ తెలంగాణ అంతటా నీడనిచ్చే పరిస్థితి ఏర్పడింది.. మీరిచ్చిన దీవెనలతో ఇంత వాడినయ్యా. సిద్దిపేట ప్రజల ఆత్మీయతను ఎన్ని వజ్రాలిచ్చినా కొనుక్కోలేను’.. అని సీఎం కేసీఆర్ అన్నారు. సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ, ఇవాళ ఇంత ఎత్తుకు ఎదిగానంటే అది ఇక్కడి ప్రజల ఆశీర్వచనాలే అని అన్నారు. సిద్దిపేటలో చాలా పనులు మనం చేసుకున్నామన్నారు.
ఇంకా చేసుకోవాల్సిన మూడు పనులు ఏవైతే పూర్తవుతాయో అప్పుడు సిద్దిపేట ఒక వజ్రపు తునకగా తయారవుతుందన్నారు. అందులో ఇప్పటికే రైల్వే పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతాంగానికి సాగు నీరందించడానికి త్వరలోనే కాళేశ్వరం వద్ద శంకుస్థాపన చేసుకుంటామన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి, ఈ ప్రాంత ప్రజల అక్కాచెల్లెళ్ల పాదాలను కడుగుతానని అన్నారు. త్వరలో సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా ఏర్పాటు చేస్తామన్నారు.

‘సిద్దిపేటకు బాకీ ఉన్న మూడు పనులను త్వరలోనే పూర్తి చేస్తా.. సిద్దిపేట వజ్రం తునక.. రిజర్వాయర్ పనుల శంకుస్థాపనకు త్వరలోనే వస్తా’ అని సీఎం కేసీఆర్ చెప్పారు. 2014 డిసెంబర్ 10న సిద్దిపేటలో మానేరు నీటి పథకంపై రాష్ట్ర మంత్రుల బృందానికి, అధికారులకు సిద్దిపేట ఫిల్టర్‌బెడ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వివరించారు. సిద్దిపేటలో జరిగిన కార్యక్రమాలు మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో జరిగాయి.
సిద్దిపేట పబ్లిక్ సర్వెంట్ హోమ్, సిద్దిపేట మున్సిఫ్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 50శాతం నిధులు విడుదల చేస్తానని చెప్పారు. సిద్దిపేటను త్వరలోనే జిల్లా చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రాంత ప్రజలకు ఎంతో ముఖ్యమైన మూడో పని సాగు నీరు అందించడమే అన్నారు. ‘సాగు నీరందించడానికి మీ ఆణిముత్యం.. మంత్రి హరీశ్‌రావు మీ వద్దే ఉన్నాడు.. ఆ బాధ్యత ఆయన్నే చూసుకుంటాడు’ అని ప్రజల హర్షధ్వానాల మధ్య చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాలకు సాగు నీరందనుందన్నారు. ఢిల్లీకి రాజైనా.. తల్లికి కొడుకే.. అన్నట్టుగా నేను సీఎం అయినా సిద్దిపేట బిడ్డనే.. అని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ‘మనఊరు-మనబడి’ కార్యక్రమాన్ని చేపట్టింది.అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల విద్యను ప్రవేశపెడుతున్నది. ఉమ్మడి జిల్లాలో ఈ పథకం కింద 1097పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో సిద్దిపేట జిల్లాలో 343, మెదక్ జిల్లాలో 313, సంగారెడ్డి జిల్లాలో 441 పాఠశాలలు ఎంపిక చేయగా, పనులు జోరుగా జరుగుతున్నాయి.
