హుస్నాబాద్, జూన్ 1: హుస్నాబాద్‌లో బుధవారం నిర్వహించిన 5కేరన్‌లో మహిళా చైతన్యం వెల్లివిరిసింది. ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, హుస్నాబాద్ పోలీసుశాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు 5కేరన్ నిర్వహించగా, నియోజకవర్గంలోని పలు మండలాల నుంచి అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, సిద్దిపేట సీపీ శ్వేతారెడ్డి 5కేరన్ను జెండా ఊపి ప్రారంభించగా మల్లెచెట్టు, అంబేద్కర్ చౌరస్తా, పోతారం(ఎస్) గ్రామం నుంచి శుభంగార్డెన్ వరకు పరుగు కొనసాగింది.
అనంతరం శుభం గార్డెన్లో జరిగిన సమావేశంలో విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధిలో మహిళలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 14సంవత్సరాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తయారు చేసేందుకు సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని గుర్తుచేశారు.
మహిళాభివృద్ధి కోసం సంక్షేమ పథకాలు, వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను సైతం అమలు చేస్తున్నారన్నారు. మహిళల కష్టాలు తీర్చేందుకే మిషన్ భగీరథ పథకం తీసుకొచ్చారన్నారు. త్వరలోనే గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తిచేసి ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీరుస్తామన్నారు. సిద్దిపేట సీపీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ.. నిత్యం వ్యాయామం, యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. నిత్యం రన్నింగ్, వాకింగ్, యోగా లాంటివి చేస్తూ శరీరాన్ని సమతుల్యంగా ఉంచుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, అడిషనల్ డీసీపీ మహేందర్, ఏసీపీ సతీశ్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, కమిషనర్ రాజమల్లయ్య, ఎంపీపీలు లకావత్ మానస, కొక్కుల కీర్తి, జడ్పీటీసీ భూక్యా మంగ, ఎన్ఎల్సీఎఫ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి, సీఐ రఘుపతిరెడ్డి, ఎస్సై ఎస్ శ్రీధర్, కౌన్సిలర్లు కొంకటి నళినీదేవి, వాల సుప్రజ, బోజు రమాదేవి, బొజ్జ హరీశ్, భాగ్యారెడ్డి, చిత్తారి పద్మ, భూక్యా సరోజన, స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
హుస్నాబాద్‌లో 30 సంవత్సరాలు పైబడిన మహిళలకు నిర్వహించిన 5కేరన్‌లో అక్కన్నపేట మండలం మల్లంపల్లికి చెందిన మల్లం రమ ప్రథమ స్థానం పొంది రూ.లక్ష నగదు బహుమతి అందుకున్నది. ఇదే మండలం గుడాటిపల్లికి చెందిన బొడిగె రజిత రెండో స్థానం సాధించి రూ.60వేల నగదు బహుమతి, హుస్నాబాద్ పట్టణానికి చెందిన గీకురు మంజుల మూడో స్థానం రాగా ఈమె రూ.25వేల నగదు బహుమతి అందుకున్నది. వీరికి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్, సీపీ శ్వేతారెడ్డి బహుమతులు అందజేశారు. వీరితో పాటు మరో తొమ్మిది మందికి మెడల్స్ ఇచ్చారు.
ములుగు, జూన్1: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తున్నామని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం ములుగులోని అటవీకళాశాలలో మైనార్టీ గురుకుల ప్రిన్సిపాళ్లకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత ప్రభుత్వ హయాం లో గురుకుల పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలంటే తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యేవారని, నేడు సీట్ల కోసం విద్యార్థులు పోటీపడుతున్నారన్నారు.
సీఎం కేసీఆర్ హయాం లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల పాఠశాలలు గొప్ప విద్యాలయాలుగా రూపుదిద్దుకున్నాయన్నారు. విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో చేరి గొప్ప విద్యావంతులుగా తయారవుతున్నారన్నారు. విద్యాభివృద్ధికి పెద్దపీట వేసి నాణ్యమైన విద్యనందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.గురుకుల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.
