మెదక్ రూరల్,మెదక్, మే 30 (నమస్తే తెలంగాణ) : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే ప్రజావాణిని నిర్వహిస్తునట్లు జిల్లా ఎస్పీ రోహణి ప్రియదర్శిని అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధానకార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ మండలం రుస్తుంపేట గ్రామానికి చెందిన గుర్రాల సుజాతకు ఇద్దరు పిల్లలు ఉన్నారని తన భర్త మూడేండ్ల నుంచి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు.
నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన అబ్బుగారి యాదగిరి తాను దివ్యాంగుడినని గ్రామంలో 25 గుంటల భూమి ఉన్నదని తండ్రి బతికి ఉన్నంతకాలం అట్టి భూమిలో సాగుచేశామని, కొన్ని నెలల తర్వాత వెళ్లి చూడగా కొందరు వ్యక్తులు కబ్జా చేసి, ఇదేంటి అని అడిగితే దౌర్జనం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారులకు తగిన న్యాయం చేస్తామని ఎస్పీ తెలిపారు.
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ ..సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ రమేశ్ అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 47 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌కు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ధరణికి సంబంధించి 26 వినతులు రాగా, వివిధ సమస్యలకు సంబంధించి 21 వినతులు వచ్చాయి. జడ్పీ సీఈవో శైలేష్, డీఎస్వో శ్రీనివాస్, డీపీవో తరుణ్‌కుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ గంగయ్య, లీడ్ బ్యాంక్ మేనేజర్ వేణుగోపాల్‌రావు, డీటీవో చిన్నసాయిలు, డీఈవో రమేశ్‌కుమార్, మైన్స్ ఏడీ జయరాజ్, అధికారులు పాల్గొన్నారు.