చౌటకూర్, మే30: భూ తగాదాలతో నెలకొన్న వివాదంలో అన్నను తమ్ముళ్లు హత్య చేసిన ఘటన పుల్కల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. డీఎస్పీ బాలాజీ కథనం ప్రకారం.. మండలంలోని శివంపేట గ్రామానికి చెందిన కుమ్మరి మల్లయ్యకు కిష్టయ్య, గోపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్ నలుగురు కొడుకులు. వీరి మధ్య కొంతకాలంగా భూ పంపకాల విషయంలో మల్లయ్య పెద్ద కొడుకు కిష్టయ్య తన ఇద్దరు కుమారులు రమేశ్, రాజులతో కలిసి తమ్ముళ్లు గోపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్‌లపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. ఈ విషయంలో పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు.
అయినా భూ పంపకాల విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న కిష్టయ్య, ఇద్దరు కుమారులతో కలిసి మళ్లీ తమ్ముళ్లపై దాడికి ప్రయత్నించాడు. ఎప్పటికైనా తమను హత్య చేస్తారనే భయంతో గోపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్, వారి కుమారులు శ్రీశైలం, సిద్దార్థ్, భిక్షపతి భయాందోళనలు చెందారు. సోమవారం ఉదయం 8గంటల ప్రాంతంలో బీరు పరిశ్రమ సమీపంలోని వ్యవసాయ భూమిలో కిష్టయ్య భార్య, కొడుకు రాజు, కోడలు మమత, అల్లుడు శేఖర్‌తో కలిసి చేనులో పని చేస్తున్నాడు. గతంలో జరిగిన ఘటనలు మనస్సులో పెట్టుకున్న గోపాల్, శ్రీనివాస్, లక్ష్మణ్, శ్రీశైలం, భిక్షపతి ముకుమ్మడిగా ఇనుప రాడ్లు, కట్టెలతో కిష్టయ్యపై దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ కిష్టయ్య అక్కడికక్కడ మృతి చెందాడు.
మిగిలిన వారికి గాయాలయ్యాయి. ఇందులో మృతుడు చిన్న కుమారుడు రాజుకు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తరలించారు. రాజు పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలాన్ని సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సంగారెడ్డి రూరల్ సీఐ శివలింగం, పుల్కల్ ఎస్సై గణేశ్‌తో కలిసి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.