పాఠశాలలు, పల్లెప్రకృతి వనాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాలు స్వతంత్ర వజ్రోత్సవాలకు వేదికయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన వనమహోత్సవ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొని వేలాది మొక్కలను నాటారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో కలెక్టర్ శరత్‌నాయక్ ఫ్రీడం పార్కును ప్రారంభించి మొక్కలు నాటగా, పుల్కల్లో జడ్పీచైర్‌పర్సన్ మంజు శ్రీజైపాల్రెడ్డి పాల్గొన్నారు. పటాన్చెరు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, మాణిక్‌రావు మొక్కలు నాటి నీళ్లు పోశారు. మెదక్‌లో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, మనోహరాబాద్ మండలం పర్కిబండ కాత్యాయని దేవాలయ ఆవరణలో జడ్పీ చైర్పర్సన్ హేమలతా పాల్గొన్నారు. మెదక్ పాత బస్టాండ్ నుంచి జూనియర్ కళాశాల వరకు ముస్లిం మైనార్టీలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాటిన మొక్కలను సంరక్షించుకోవాలని, పల్లెలను హరితతోరణాలుగా మార్చి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని పిలుపునిచ్చారు.
– మెదక్/ సంగారెడ్డి నెట్వర్క్, ఆగస్టు 21
సీఎం కేసీఆర్ పిలుపుమేరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా పచ్చదనం కోసం పట్టణాలు, గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. ఎనిమిదేండ్లుగా నిర్వహిస్తున్న హరితహారంతో కాలుష్యం తగ్గుముఖం పడుతున్నదని అధికారులు తెలిపారు.
మొక్కలు చెట్లుగా మారి ప్రాణవాయువును ఇస్తున్నాయని పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు నిర్వహిస్తున్న హరితహారం పర్యావరణానికి మేలు చేస్తున్నదన్నారు. హరితహారంలో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వామ్యం కావడంతోనే విజయవంతం అవుతున్నదని వారు తెలిపారు. పటాన్చెరు, మెదక్ పట్టణాల్లో జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు నిర్వహించారు.
మెదక్‌లో ముస్లింలు జాతీయ జెండాలు పట్టుకుని జై భారత్.. జైజై భారత్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. నాటిన మొక్కలను సంరక్షిస్తే భవిష్యత్తు తరాలకు వనరులుగా ఉంటుందన్నారు. మొక్కలను నాటడం ఎంత ముఖ్యమో బతికించుకోవడం అంతే ముఖ్యమని పిలుపునిచ్చారు.