స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలు జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఆదివారం 14వ రోజు గ్రామాలు, పట్టణాల్లో వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములయ్యారు. వన మహోత్సవం ఆవశ్యకతపై ప్రజలకు అవగాహన కల్పించారు. సిద్దిపేటలో మున్సిపల్ చైర్పర్సన్ కడవేర్గు మంజులారాజనర్సు, మున్సిపల్ కమిషనర్ రవీందర్రెడ్డి, గజ్వేల్లో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్తో పాటు కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.
మానవ మనుగడ కోసం హరిత యజ్ఞానికి శ్రీకారం చుట్టిన తెలంగాణ సర్కారు హరితహారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. జీవకోటికి జీవనాధారం చెట్లు.. నేటి మొక్క రేపటి తరాలకు భవిష్యత్ అని భావిస్తున్న ప్రభుత్వం మొక్కలను విరివిగా నాటాలని సంకల్పిస్తున్నది. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పల్లెలు, పట్టణాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని మొక్కలు నాటారు.
-నమస్తే నెట్వర్క్, ఆగస్టు 21