పేదోడి కలల సౌధమైన సొంతింటి కలను నిజం చేసి చూపిస్తున్నది తెలంగాణ సర్కారు. రూపాయి ఖర్చు లేకుండా అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ప్రభుత్వం పేదలకు అందజేసేందుకు రూ.44 కోట్లతో జహీరాబాద్ పట్టణంలోని రహ్మిత్నగర్లో 312, హోతి (కే) శివారులో 660, కోహీర్ మండలం దిగ్వాల్లో 88 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది. అధికారులు అర్హులను గుర్తించగా, లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి, ఇండ్ల గృహప్రవేశాలు చేయించేందుకు సిద్ధమవుతుండడంతో నిరుపేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో నిరుపేదల సొంతింటి కల త్వరలో నెరవేరనున్నది. జహీరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రహ్మిత్నగర్లో 312, హోతి(కే)లో 660కోహీర్ మండలం దిగ్వాల్లో 88 డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసింది. దిగ్వాల్లో ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించగా, మిగతా రెండు చోట్ల త్వరలో ఎంపిక చేయనున్నారు. రూ.44కోట్లతో ఇండ్ల నిర్మాణాలు చేపట్టగా, అన్ని మౌలిక వసతులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దరఖాస్తులు వేల సంఖ్యలో రావడంతో అధికారులు అర్హులను గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి క్షేత్రస్థాయిలో పక్కా సర్వే నిర్వహించారు. నెలాఖరునాటికి మంత్రి హరీశ్‌రావుతో గృహప్రవేశాలు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జహీరాబాద్ మండలం రహ్మిత్నగర్లో 312, హోతి (కే) శివారులో 660, కోహీర్ మండలం దిగ్వాల్ 88 డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తున్నది. హోతి(కే)లో ఇండ్ల నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రహ్మత్ నగర్, దిగ్వాల్లో ఇప్పటికే రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో పంపిణీకి సిద్ధమయ్యాయి. పట్టణంలోని రహ్మిత్నగర్లో 312 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తవ్వడంతో, అధికారులు 1411 మంది అర్హులను గుర్తించారు. త్వరలోనే డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. కాగా, కోహీర్ మండలం దిగ్వాల్లో 88 డబుల్ ఇండ్లు పూర్తి కాగా, అధికారులు లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశారు. నెలాఖరు వరకు ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల గృహప్రవేశాలు చేయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, కలెక్టర్ శరత్‌లు ఇప్పటికే డబుల్ ఇండ్లను పరిశీలించి, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. మిగిలిపోయిన చిన్నచిన్న పనులను పూర్తి చేసి, ప్రారంభానికి సిద్ధం చేయాలని సూచించారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి అధికారులు పకడ్బందీగా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఇంటికీ వెళ్లి రెవెన్యూ అధికారులు సర్వేచేసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు. జహీరాబాద్ మున్సిపల్లో డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం వేల సంఖ్యలో దరఖాస్తులు రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు వార్డుల వారీగా సర్వే నిర్వహించారు. ఆర్డీలో రమేశ్ బాబు, తహసీల్దార్ నాగేశ్వర్రావు, డిప్యూటీ తహసీల్దార్ కిరణ్‌కుమార్ పర్యవేక్షణ చేసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు.
జహీరాబాద్ పట్టణంలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేస్తాం. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం చేశాం. లాటరీ ద్వారా ఎంపిక చేసి డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయనున్నాం. రహ్మిత్నగర్లో 312 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో త్వరలోనే లబ్ధిదారులకు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. దిగ్వాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేశాం. వారికి మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు పంపిణీ చేయనున్నాం.
– కొనింటి మాణిక్‌రావు, ఎమ్మెల్యే జహీరాబాద్
జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని రహ్మిత్నగర్లో నిర్మార్మించిన 312 ఇండ్లకు అధికారులు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక టాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. సీసీ రోడ్లు, మురుగు కాల్వలు నిర్మాణం చేశారు. చిన్నపిల్లల పార్కు ఏర్పాటుతో పాటు ప్రధాన గేట్ నిర్మాణం చేశారు. హరితహారం భాగంగా రోడ్డుకు ఇరు వైపులా మొక్కలు పెంచడంతో డబుల్ బెడ్రూం ఇండ్ల పరిసరాలు పచ్చదనంతో ఆకట్టుకుంటున్నాయి.