కొల్చారం, ఆగస్టు21: రోడ్లు ప్రగతికి సూచికలు. ఒక ప్రాంతంలో రవాణా వ్యవస్థ మెరుగుపడి, ప్రయాణం సాఫీగా సాగాలంటే రోడ్డు సౌకర్యం బాగుండాలి. తెలంగాణ ఆవిర్భవించాక సీఎం కేసీఆర్ విద్యుత్, సాగునీటి రంగాలతో పాటు రోడ్ల నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల రోడ్లను ఆధునీకరించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా పలు రోడ్లను ఆధునీకరించారు. మరిన్ని రోడ్లకు రీబిటింగ్ పనులు మంజూరు చేయించారు.
అన్ని గిరిజన తండాల్లో ప్రత్యేక నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులు చేయించారు. కొల్చారం మండలంలోని పలు రోడ్లను ఆధునీకరించారు. మెదక్- హైదరాబాద్ వయా నర్సాపూర్ నాలుగు లేన్ల హైవే నిర్మించారు. ఎన్నో ఏండ్లుగా ఇబ్బందికరంగా ఉన్న మెదక్- సంగారెడ్డి రోడ్డు సంగాయిపేట నుంచి దుంపలకుంట వరకు రెండు లేన్ల రోడ్డు వేయించారు.
ఏడుపాయలకు వెళ్లే మంజీరా నదిపై మూడు లో లెవల్ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు రెండు లేన్ల రోడ్డు నిర్మాణం, డివైడర్ బటర్‌ఫ్లై లైట్లు అమర్చారు. పోతంశెట్‌పల్లి చౌరస్తా గుండా కొంగోడు వరకు రీబిటింగ్ చేశారు. మరో మూడు రోడ్ల రీబిటింగ్ పనులు మంజూరయ్యాయి. మరో రోడ్డు నిర్మాణానికి సీఎం పేషీకి ప్రతిపాదనలు పంపించారు.
కొల్చారం బస్టాండ్ నుంచి వసురాంతండా వరకు ఉన్న బీటీ రోడ్డు అధ్వానంగా మారింది. ఈ రోడ్డు గుండా ప్రయాణమంటే వాహనాలు చెడిపోవడం, ప్రమాదాలు జరగడం ఖాయమని ప్రజలు భయపడుతున్నారు. ఈ రోడ్డులోనే మండల కార్యాలయాలు, పోలీస్‌స్టేషన్ ఉండడంతో పనుల కోసం చుట్టుపక్కల పరిసర గ్రామాల నుంచి ప్రజలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది. రీబిటింగ్ పనుల కోసం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కలెక్టర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయించారు.
మండలంలోనే అతి పెద్ద లింక్ రోడ్డు రంగంపేట- చాముండేశ్వరి రోడ్డు. ఈ రోడ్డు రంగంపేట, తుక్కాపూర్, పైతర, కోనాపూర్, ఏటిగడ్డ మాందాపూర్, ఎనగండ్ల గ్రామాల గుండా చాముండేశ్వరి దేవాలయం వరకు వెళ్తుంది. ఈ రోడ్డు గుంతలమయంగా మారడంతో ఎమ్మెల్యే రూ.7 కోట్లు రీబిటింగ్కు మంజూరు చేయించారు.
కొల్చారం నుంచి వరిగుంతం సబ్‌స్టేషన్ (సంగాయిపేట పీడబ్ల్యూడీ రోడ్డు) వరకు రీబిటింగ్కు రూ.1.05 కోట్లు మంజూరయ్యాయి. ఈ పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటివరకు ఏడుసార్లు టెండర్లు పిలిచారు. పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకురాలేదు.
కొల్చారం గుండా ఎస్సీ కాలనీ కలుపుతూ సిరామిక్స్ పైపుల కంపెనీ నుంచి పీడబ్ల్యూడీ రోడ్డు వరకు కంకర రోడ్డుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్సీ కాలనీవాసులు ఊర్లోకి రావాలంటే తిప్పలు పడుతున్నారు. ఈ రోడ్డు మంజూరుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి సీఎం పేషీకి పంపారు. త్వరలోనే నిధులు మంజూరుకానున్నాయి.
సర్పంచ్‌గా గెలిచిన నుంచే కొల్చారం బస్టాండు నుంచి వచ్చే రోడ్డు అధ్వాన స్థితి గురించి ఎమ్మెల్యే మదన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన. ఎస్సీ కాలనీ నుంచి సిరామిక్స్ పైపుల కంపెనీ, అప్పాజిపల్లి దగ్గర్లో పీడబ్ల్యూడీ రోడ్డు వరకు కొత్త బీటీ రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేకు వివరించా. తప్పకుండా చేస్తానని మాటిచ్చి, రీబిటింగ్ రోడ్డు మంజూరు చేయించారు. అధికారులు టెండర్లు పిలిచి పనులు చేయించి ప్రజల ఇబ్బందులు తీర్చాలి.
– కరెంటు ఉమ రాజాగౌడ్, సర్పంచ్