మిరుదొడ్డి, జూలై 24: సీఎం కేసీఆర్ కృషితో దుబ్బాక నియోజకవర్గం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మిరుదొడ్డి టౌన్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మహంకాళిదేవి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మిరుదొడ్డి, అక్బర్‌పేటలోని అమర వీరుల స్తూపం వరకు బైక్‌ను నడుపు కుంటూ ర్యాలీ నిర్వహించి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి టీఆర్ఎస్ నేతలకు తినిపించి, మొక్కలు నాటారు. త్వరలో ఏర్పాటు కానున్న అక్బర్పేట-భూంపల్లి నూతన మండలానికి అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి 121 సర్వే నెంబర్లో రెండెకరాలు, 133 సర్వే నెంబర్లో 30 గుంటల భూమిని పరిశీలించారు.
ప్రజాప్రతినిధులు ఎంపీని శాలువాతో సన్మానించగా, అక్బర్పేట సర్పంచ్ స్వరూపాభిక్షపతి, వార్డు సభ్యులు గజమాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. అక్బర్‌పేటకు చెందిన బీజేపీ వార్డు సభ్యులు మన్నె నర్సింలు, బాల్‌నర్సయ్య టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఎంపీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్డును బహుమతిగా నూతన మండలంగా ఏర్పాటుకు హామీ ఇచ్చినందుకు సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావుకు దుబ్బాక నియోజకవర్గం ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కొందరు వాట్సాప్, ట్విట్టర్లో వార్తలు చూసుకోవడం తప్పా..? వారితో నయా పైసా అభివృద్ధి జరగలేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో వాట్సాప్ నాయకులతో ఎలాంటి అభివృద్ధి జరుగదని ప్రజలు ఎప్పుడో గ్రహించారన్నారు.
20 ఏండ్ల నుంచి ప్రజలు కోరుకుంటున్న కల సీఎం కేసీఆర్ ఆశీస్సులతో అక్బర్పేట-భూంపల్లి ఎక్స్రోడ్డుగా నూతన మం డలం ఏర్పడుతున్నదని ఎంపీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అక్బర్పేట గ్రామం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు సెంటర్‌గా ఉండడంతోపాటు ఇక్కడ వ్యాపారపరంగా అనువైన ప్రాం తంగా ఉండడంతో నూతన మండలాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు.
మంత్రి కేటీఆర్ పుట్టినరోజు, ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ, అక్మర్పేట ఉప సర్పంచ్ నరేశ్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, వెంకట్, పర్శరాములు, నర్సింగ్బాలు, మిరుదొడ్డి, దుబ్బాక మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.