మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 13: మెదక్ కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఆర్అండ్బీ అధికారులకు సూచించారు. బుధవారం జిల్లా పరిషత్ స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. 7వ స్థాయీ సంఘ సమావేశానికి ఎమ్మెల్సీ హాజరై, కలెక్టరేట్ పనుల గురించి ఆరా తీశారు. పనులు ఎంత వరకు వచ్చాయి, ఎప్పుడు పూర్తి చేస్తారని ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఫినిషింగ్ పనులు మాత్రమే ఉన్నాయని ఎమ్మెల్సీకి వివరించారు.
మెదక్‌లోని ప్రధాన రోడ్డు వంద ఫీట్లు లేకున్నా ధ్యాన్‌చంద్, రాందాస్ చౌరస్తాల్లో సర్కిల్ పెద్దగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కొంత మేరకు తగ్గిస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఈఈకి తెలిపారు. మెదక్ నుంచి తుర్కపల్లి-సిద్దిపేట వరకు జాతీయ రహదారి మంజూరైందని, మెదక్ నుంచి బోడ్మట్పల్లి, అల్లాదుర్గం మీదుగా బీదర్ వరకు జాతీయ రహదారి పొడిగించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరిని కలవనున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. పలు చెక్‌డ్యాంల పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయని, వర్షాకాలం రాకముందే పూ ర్తి చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. హవేళీఘనపూర్ మండలంలోని చౌట్లపల్లి చె రువు పనులు పూర్తి చేసినా బిల్లులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, తొందరగా చెల్లించాలని తెలిపారు. రోడ్లపై కేజీవీల్ ట్రాక్టర్లు తిప్పితే జారిమానాలు విధించి చర్యలు తీసుకోవాలని డీటీవో శ్రీనివాస్‌కు ఆదేశించారు. నిజాంపేట మండలంలోని లోవోల్జేజీతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ విజయ్‌కుమార్ అధికారుల దృష్టికి తెచ్చారు.
గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతా శేఖర్‌గౌడ్ అన్నారు. బుధవారం 1, 2, 4, 7వ స్థాయీ సంఘ సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ అధ్యక్షతన జరిగాయి. శాఖల వారీగా అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆమె సమీక్షించారు. సమావేశాలకు చాలా మంది అధికారులు హాజరు కాకపోవడంతో జడ్పీ చైర్పర్సన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ సమావేశాల్లో జడ్పీ సీఈవో శైలేశ్, డిప్యూటీ సీఈవో సుభాషిణి, జడ్పీటీసీలు మాధవి, సూజాత, సౌందర్య, విజయరామరాజు, బాబ్యానాయక్ పాల్గొన్నారు.