పాపన్నపేట, అక్టోబర్ 15 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు , అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు దంపతులు దుర్గామాతకు పట్టు వస్ర్తాలు సమర్పించి దేవీ శరన్నవరాత్రి దసరా మహోత్సవాలు ప్రారంభించారు.
ఘనంగా పల్లకీ సేవ
ఏడుపాయల వనదుర్గామాత ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉత్సవ విగ్రహాన్ని శైలపుత్రి రూపంలో అలంకరించి ఆలయం నుంచి ఉత్సవాలు నిర్వహించే గోకుల్ షెడ్ కు ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో తరలించారు.ఈ పల్లకి సేవలో మెదక్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు దంపతులు పాల్గొనగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు పాల్గొన్నారు. మొదటి రోజు ఆదివారం పాడ్యమిని పురస్కరించుకొని అమ్మవారు(శైలపుత్రి)బాల త్రిపురాసుందరి దేవి ఆకారంలో పసుపు రంగుతో అలంకరించారు. ఆలయ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్,ఆలయ ఈవో మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
నేడు బ్రహ్మచారినిగా దర్శనం
రెండో రోజు సోమవారం శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గామాత బ్రహ్మచారిని (గాయత్రీ దేవి) రూపంలో గులాబీ రంగు అలంకరణలో దర్శనమివ్వను న్నట్లు ఆలయ చైర్మన్ వెల్లడించారు.