.

జగదేవ్‌పూర్,జూన్27: చాట్లపల్లి గ్రామాన్ని తానే స్వయంగా దత్తత తీసుకుని అర్హులందరికీ డబుల్ ఇండ్లను కట్టిస్తామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు గ్రామస్తులకు హామీ నిచ్చారు. మండలంలోని చిన్నకిష్టాపూర్, చాట్లపల్లి, తీగుల్, మునిగడప, ఇటిక్యాల గ్రామాల్లో అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. చాట్లపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హారీశ్‌రావు ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాన్ని దత్తత తీసుకుని నిరుపేదలందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. రెండుమూడు రోజుల్లో కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డిని గ్రామానికి పంపించి డబుల్ బెడ్రూం ఇండ్లలో అవకతవకలు జరిగినట్లు తెలిస్తే వాటిని అర్హులకు అందిస్తామన్నారు. లబ్ధిదారుల కోసం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోవడంతో వారందరికీ ఇంటి స్థలం ఉంటే ఇల్లు కట్టిస్తామని, స్థలం లేనివారికి రెండెకరాల్లో ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు. అనంతరం 29 లబ్ధ్దిదారులచే గృహప్రవేశాలు చేయించారు. గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం చాలా బాగుందని యువత కోసం ఏర్పాటు చేసిన జిమ్ సెంటర్‌ను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. అనంతరం మునిగడప గ్రామానికి చేరుకుని రైతువేదికను, తీగుల్ గ్రామంలో వైద్యసిబ్బంది నివాసగృహాలు, గ్రామపంచాయతీ భవనం, రైతువేదిక, చిన్నకిష్టాపూర్‌లో మహిళా సమైక్య భవననాన్ని మంత్రి ప్రారంభించారు.
ఇటిక్యాల ప్రకృతి వనం జిల్లాకు ఆదర్శం
మండల పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం జిల్లాకు ఆదర్శంగా ఉందని మంత్రి హరీశ్‌రావు కితాబునిచ్చారు. ఇటిక్యాలలో పల్లె ప్రకృతి వనాన్ని చూసేందుకు సిద్దిపేట జిల్లా వాసులను పంపిస్తామన్నారు. సర్పంచ్ చంద్రశేఖర్ గ్రామాభివృద్ధే లక్ష్యంగా బాగా కృషి చేస్తున్నాడని అభినందించారు. అనంతరం పల్లె ప్రకృతి వనం, రైతు వేదికలను ప్రారంభించి, ఇటిక్యాలలో గ్రామస్తుల ఐక్యత చాలా బాగుందని, గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని, ప్రజల ఆదరాభిమానాలు ఎంతో నచ్చాయన్నారు.
ఇటిక్యాలకు 150 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు
ఇటిక్యాల గ్రామాభివృద్ధికి నిరుపేదల కోసం 150 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసినట్లు మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. పల్లె ప్రకృతివనం, రైతువేదికలు బాగున్నాయని, గ్రామం నుంచి రైతువేదిక వరకు సీసీరోడ్లు మంజూరు చేస్తున్నామన్నారు.
రైతుగా మారిన మంత్రి హరీశ్‌రావు..
వెదజల్లే సాగుపై అవగాహన కల్పించడానికి ఇటిక్యాల గ్రామంలో వ్యవసాయం పొలంలో మంత్రి హరీశ్‌రావు దిగి స్వయంగా తానే వరి విత్తనాలను వెదజల్లారు. వెదజల్లే సాగుతో 35 శాతం నీటి వినియోగం, రైతుకు నారు పోయడం, నాట్లు వేసేందుకు కూలీల ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. నేరుగా వరివిత్తనాలను పొలంలో చల్లడం వల్ల కేవలం 8కిలోల వరివిత్తనాలు మాత్రమే సరిపోవడమే కాకుండా 15 రోజుల ముందుగానే పంట చేతికి వస్తుందన్నారు. ఈ కార్యక్రమం ముగిసాక వట్టిపల్లి గ్రామం నుంచి వస్తున్న మంత్రి హరీశ్‌రావుకు గ్రామసర్పంచ్ రజిత రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కలిసి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని, గ్రామంలో రహదారి, బైపాస్ రోడ్డు వేయించాలని కోరారు.
రూ.6.36 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
మంత్రి హరీశ్‌రావు జగదేవ్‌పూర్ మండలంలో రూ.6కోట్ల36లక్షల విలువైన అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపనలు చేశారు. చిన్నకిష్టాపూర్‌లో రూ.20లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, రూ.16లక్షలతో నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీహాలు, చాట్లపల్లిలో రూ.3.15కోట్ల వ్యయంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రారంభించారు. రూ.7.50లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.44లక్షలతో నిర్మించిన పాఠశాల అదనపు తరగతి గదులను ప్రారంభించారు. మునిగడపలో రూ.22లక్షలతో రైతువేదిక ప్రారంభించగా, రూ.35లక్షల నిర్మిస్తున్న ఓవర్హెడ్వాటర్ట్యాంకు పనులకు శంకుస్థాపన చేశారు.
తీగుల్‌లో రూ.22లక్షలతో రైతువేదిక, రూ.62లక్షల గ్రామపంచాయతీ భవనం, రూ.22లక్షలతో గ్రామ మహిళా సమాఖ్య భవనం, రూ.64లక్షలతో నిర్మించిన పీహెచ్సీ సిబ్బంది సమావేశ మందిరం, గృహసముదాయంలను ప్రారంభించారు. ఇటిక్యాలలో పల్లె ప్రకృతివనం, రూ.22లక్షలతో నిర్మించిన రైతువేదికలను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమాలలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీచైర్‌పర్సన్ రోజాశర్మ, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ బాలేశంగౌడ్, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, రైతుబంధు మండల కో-ఆర్డినేటర్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు నరేశ్, ఆత్మకమిటీ చైర్మన్ రంగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్‌లు భానుప్రకాశ్, బాల్‌లక్ష్మి, చంద్రశేఖర్, ఎంపీటీసీలు కిరణ్‌గౌడ్, కావ్యదర్గయ్య, కవిత, నాయకులు కరుణాకర్, నాగరాజు, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
పామాయిల్ సాగు చేపట్టాలి..
గోదావరి జలాలతో రానున్న కొద్దిరోజుల్లో జగదేవ్‌పూర్ మండలాల్లోని అన్ని గ్రామాలకు నీరందుతాయని చెప్పారు. రైతులంతా అధికదిగుబడి ఇచ్చే పామాయిల్సాగును చేపట్టాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం 90 శాతం సబ్సిడీతో పామాయిల్ సాగును ప్రోత్సహిస్తుందని, ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు.