
రామాయంపేట, జూన్ 25: కరోనా కారణంగా ఇంటి యజమాని, పోషకుడు మరణిస్తే ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందిస్తున్నదని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. ఈనెల 26లోగా మెదక్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని అన్నారు. శుక్రవారం మల్లె చెరువు మినీ ట్యాంకుబండ్ పనులను పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన కులాలకు చెందిన వారు ఇంటిపోషణ చేసేవారు కరోనాతో మృతి చెందితే వెంటనే సంబంధిత అధికారులతో మరణ ధ్రువీకరణ సర్టిఫికెట్‌ను పొంది జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్‌కు జిల్లా కేంద్రంలోనే దరఖాస్తులను అందజేయాలన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా మరణించిన సంబంధీకులకు ఏదేని చిన్న పరిశ్రమలకు ప్రభు త్వం రూ.5లక్షల యూనిట్‌ను అందిస్తుందన్నారు. అందులో 20 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. 18 నుంచి 60 సంవత్సరాల లోపల కరోనాతో మృతి చెందిన వారికే ఈ అవకాశం ఉంటుందన్నారు. ఈనెల 26వ తేదీ వరకు తమ దరఖాస్తులను అందజేయాలని అన్నారు. ఈ సబ్సిడీ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమస్యల పరిష్కారానికి కృషి: మున్సిపల్ చైర్మన్
వార్డుల్లో ఉన్న సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం వార్డుల కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసిందని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం రామాయంపేట మున్సిపల్లోని 6, 4వ వార్డుల్లో సమావేశాలు నిర్వహించి సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకుని వార్డు కమిటీలు వేశారు. వార్డులోని పనులను త్వరితగతిన పూర్తి చేస్తానని అన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే వార్డుల్లో సమస్యలు లేకుండా పూర్తి చేయగలిగామని చైర్మన్, కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు దేమె యాదగిరి, గజవాడ నాగరాజు, సిబ్బంది కాలేరు ప్రసాద్, నవాత్ ప్రసాద్, బల్ల శ్రీనివాస్, శంకర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్ ఉన్నారు.