అందోల్, అక్టోబర్ 18: సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని సంగుపేట శివారులో ఉన్న కటుకం వేణుగోపాల్ పటాకుల గోదాంలో శనివారం ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. దీపావళి పండుగ ఉండడంతో గోదాం ఆవరణలో పటాకుల నిల్వలు ఉండగా, పక్కనే ఉన్న చిత్తు కాగితాల్లో మంటలు చెలరేగి పటాకులకు తగలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భయంతో వారంతా తలోదిక్కుకు పరుగులు తీశారు. గోదాం నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం, రక్షణ చర్యలు తీసుకోక పోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తున్నది. ప్రమాదానికి దుకాణం యజమానుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు ఆరోపించారు.
రెండు రోజలు క్రితం గోదాంను తనిఖీచేసిన ఫైర్ అధికారులు, పక్కనే ఉన్న చెత్తను తొలిగించాలని, సరైన జాగ్రత్త చర్యలు తీపసుకోవాలని సూచించినా, నిర్వహకులు దీనిని పట్టించుకోన్నట్లు తెలుస్తున్నది. హోల్‌సేల్ దుకాణం అయినప్పట్టికీ రిటైల్‌గా గోదాం బయట విక్రయాలు జరుపుతున్నారు. ఎంత నష్టం జరిగింది…ప్రమాదం ఎలా సంభవించింది అనేది మంటలు అదుపులోకి వచ్చాకే తెలుస్తుందని అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలు ఆర్పేందుకు ఫైరింజన్ రావడానికి ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఇటీవల రోడ్డు డివైడర్‌ను నిర్మించిన అధికారులు, పటాకుల గోదాం వద్ద కట్టింగ్ ఇవ్వకపోవడంతో చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది.