మనోహరాబాద్, మే 28 : తప్పుడు పత్రాలతో ఫేక్ రిజిస్ట్రేషన్ చేసిన ఘటనలో గతంలో నలుగురు, మంగళవారం సబ్ రిజిస్ట్రార్‌తో సహా నలుగురితో పాటు మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మెదక్ జిల్లా మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్‌రెడ్డి తెలిపారు. ఎస్సై వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు అరుణ్‌కుమార్ అనే వ్యక్తి హైదరాబాద్ మోతీనగర్‌కు చెందిన సురావజ్జుల సత్యనారాయణ మూర్తి, అతని భార్య స్వాతికి మనోహరాబాద్ మండలం కూచారం శివారులోని సర్వే నెంబర్ 225, 226లో వెయ్యి గజాల స్థలాన్ని నకిలీ పత్రాలు సృష్టించి మరో 8 మందితో కలిసి రూ. 80 లక్షలకు విక్రయించాడు. అప్పటికే ఆ స్థలం అసలు యజమాని దుర్గా పేరిట రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. కాగా, నిందితులు హైదరాబాద్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళకు డబ్బు ఎర చూపి, లక్ష్మి ఆధార్‌కార్డును దుర్గాగా మార్ఫింగ్ చేసి సురావజ్జుల సత్యనారాయణ మూర్తి, అతని భార్య స్వాతి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారు.
సురావజ్జుల సత్యనారాయణ మూర్తి, అతని భార్య స్వాతి లింక్ డ్యాకుమెంట్ల కోసం ఆరా తీయగా, అమ్మిన వ్యక్తులు పొంతన లేని సమాధానాలు ఇచ్చారు. దీంతో వారు కొనుగోలు చేసిన ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా, వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండటంతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో బాధితుడు సురావజ్జుల సత్యనారాయణ మూర్తి, అతని భార్య స్వాతి ఏప్రిల్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎస్సై కరుణాకర్‌రెడ్డి గత నెలలో మొదటగా నలుగురిని, మంగళవారం తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణతో పాటు నలుగురిని మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణ మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎవరు వచ్చినా దురుసుగా మాట్లాడడం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఫేక్ రిజిస్ట్రేషన్‌లో సైతం తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ సనత్‌నగర్ రమణ భారీగా డబ్బులు ముడుపుగా అందుకున్నట్లు సమాచారం.