మెదక్‌రూరల్, మే 3: పేరూరు గరుడగంగ సరస్వతీ ఆలయం మంజీరా గరుడగంగ పుష్కరాలు ముగిశాయి. చివరిరోజు పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు పుష్కరఘాట్‌కు భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది . పుష్కరాలు 12 రోజుల పాటు వైభవంగా జరుగగా, బుధవారం వివిధ జిల్లాలు, పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సరస్వతీమాత ఆలయ వ్యవస్థాకుడు బ్రహ్మ శ్రీ దోర్భల రాజమౌళి శర్మ ఆధ్వర్యంలో సరస్వతీ మాతను విశేషాలంకరణ చేసి ఉదయం 4 గంటల నుంచే వేద పండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పుష్కరఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మకు పసుపు, కుంకుమతో వస్ర్తాలు, వాయినాలు సమర్పించారు.
కొందరు భక్తులు తమ పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పెద్ద కర్మలు, పిండ ప్రదానం, తదితర పూజలు వేదపండితులతో నిర్వహించారు. పుష్కర స్నానాలు ఆచరించిన మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహిక దీపారాధన చేశారు. చదువుల తల్లి సరస్వతీ మాతను దర్శించుకునేందుకు భక్తులు క్యూ కట్టారు. శివలింగానికి వివిధ రకాల పండ్లు, పసుపు, కుంకుమ, మహాజలాభిషేకం, రుద్రాభిషేకం, శివ పంచాక్షరి, భజన కార్యక్రమాలు నిర్వహించారు. పుష్కర దేవత, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. పుష్కరాలకు చివరి రోజు కావడంతో భక్తులకు ఇబ్బందులు రాకుండా వివిధ శాఖల అధికారులు, ఆలయ నిర్వాహకులు అన్ని సౌకర్యాలు కల్పించారు. పూజల్లో అర్చకులు గుణకరశర్మ, మహేశ్ శర్మ, వైద్య, చిలుకూరి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Manjira