న్యాల్కల్, ఏప్రిల్ 24: ఉత్తరాదిన అత్యంత పవిత్రంగా గంగనదికి నిర్వహించే కుంభమేళాను తలపించే విధంగా సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం రాఘవాపూర్-హుమ్నాపూర్ శివారులోని గరుడ గంగ పూర్ణ మంజీరా కుంభమేళా అట్టహాసంగా ప్రారంభమైంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో పంచవటీ క్షేత్రం, మంజీరానది తీరం కిక్కిరిపోయింది. మొదటిరోజు సోమవారం మంజీరా కుంభమేళా ప్రారంభోత్సవంలో భాగంగా కాశీనాథ్‌బాబా ఆధ్వర్యంలో ప్రత్యేక ఎడ్ల బండిలో కలెక్టర్ డాక్టర్ శరత్‌కుమార్, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ ఉమ్మడి జిల్లా చైర్మన్ శివకుమార్, ప్రత్యేక రథంలో కాశీనాథ్‌బాబా గొల్లబీర్ల వాయిద్యాల హోరు, డప్పుచప్పుళ్లు, భజన కీర్తనల మధ్య మంజీరా నదికి ఊరేగింపుగా తరలివెళ్లారు.
అనంతరం కాశీనాథ్‌బాబా, సంగ్రాం మహారాజ్, శంకర్ భారత్ మహారాజ్, కరణ్ గజేంద్ర భారతీ మహారాజ్, హనుమంత్ మహారాజ్, రాజయ్యస్వామి, రాజశేఖర్ శివస్వామి, మల్లయ్యస్వామి, కలెక్టర్, ఎమ్మెల్యేలు, డీసీఎంఎస్ చైర్మన్, నాగసాధులు, సంతులు కలిసి మంజీరా నదిలో గంగమ్మకు ప్రత్యేక పూజలు, మహాహారతి చేసి తెప్పను నదిలో విడిచిపెట్టారు. అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన నాగసాధులు, సంతులు, ప్రముఖులు, భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాలకు చెం దిన మహిళలు బోనాలతో నైవేద్యాలను గంగమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య గంగమాత ఆలయ అవరణలో నాగసాధులు, సంతులు భారీ క్రేన్ సహాయంతో ధ్వజారోహణం చేశారు. గంగమాత ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చాన, అభిషేకం, పార్థీవ లింగార్చన, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పంచవటీ క్షేత్రంలోని సరస్వతీదేవి, షిర్డీ సాయిబాబా, భూదేవి, శ్రీదేవి సామేత వేంకటేశ్వరస్వామి, సూర్యభగవాన్ ఆలయాల్లో దేవతలకు ప్రత్యేక పూజలు చేసి దర్శించుకున్నారు. పంచవటీ క్షేత్రంలోని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేజీపై పీఠాధిపతులు, ప్రముఖులు, మహాత్ములు రాం రావు మహారాజ్, శంకర్ భారత్ మహారాజ్, సం గ్రాం మహారాజ్, రాజశేఖర్ శివయోగి తదితరులు భక్తులకు ప్రవచనాలు అందజేశారు. అనంతరం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, సం గారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్‌కుమార్ మాట్లాడారు.
Medak5
లోక కల్యాణం కోసమే కుంభమేళ
-పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా
లోక కల్యాణం కోసమే గురుడ గుంగ పూర్ణ మంజీరా కుంభమేళాను నిర్వహిస్తున్నామని రాఘవాపూర్ పంచవటీ క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్‌బాబా అన్నారు. వైశాఖమాసంలో సూర్యు డు మేషరాశిలో ప్రవేశించినప్పుడు సర్వ తీర్థా లు మంజీరా నదిలో చేరుతాయన్నారు. భక్తు లు మంజీరా నదిలో పవిత్ర స్నానం ఆచరించడంతో మోక్షంతో పాటు వ్యాధులు, పాపల నుంచి విముక్తి లభిస్తున్నదన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, ‘ఖేడ్’ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, జహీరాబాద్ మున్సిపల్ మాజీ చైర్మన్లు నర్సింహులు, మంకాల్ సుభాశ్, బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్, గుండప్ప, నర్సింహారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, ఆర్టీవో రమేశ్‌బాబు, డీఎస్పీ రఘు, తహసీల్దార్ ఆంటోనీ, డిప్యూటీ తహసీల్దార్ విజయలక్ష్మి, డీఎల్పీవో రాఘవరావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ సాబేర్ హుస్సేన్, ఖేడ్ డిపో మేనేజర్ మల్లేశయ్య, ఎంపీడీవో వెంకట్‌రెడ్డి, డీపీవో సురేశ్, జహీరాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్, హద్నూర్, రాయికోడ్ ఎస్సైలు వినయ్కమార్, ఏడుకొండలు, పీఆర్ఏఈ కృష్ణ, ట్రాన్స్‌కో ఏఈలు అర్జున్, మహేశ్, వైద్యాధికారులు శ్వేతప్రియా, గణపతిరావు, నృపేన్ చక్రవర్తి పాల్గొన్నారు.